11-08-2024 06:33:43 AM
వలస వచ్చిన వారికి రెండు రాష్ట్రాల్లో కార్డులు
ఎక్కడ కార్డు కావాలో వారే తేల్చుకోవాలి
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణకు వలస వచ్చినవారికి వారి సొంతరాష్ట్రంతోపాటు ఇక్కడా రేషన్‌కార్డులు ఉన్నట్టు తేలిందని, అలాంటి వారు ఎక్కడ కార్డు కావాలో తేల్చుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. వాటికి సంబంధించిన విధి, విధానాలను ఖరారు చేసేందుకు శనివారం సచివాలయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ ఉప సంఘం సభ్యులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిష్టియానా జెడ్ చోంగ్తూ పాల్గొని పలు అంశాలను పరిశీలించారు. తెల్ల రేషన్‌కార్డులకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, మాగాణి 3.5 ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలనే ప్రతిపాదన ఉప సంఘం ముందుకు వచ్చిందని చెప్పారు.
కార్డుల మంజూరులో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నట్టు పేర్కొన్నారు. కొత్త కార్డుల జారీకి రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచలను తీసుకోనున్నట్టు ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికి లేఖ రాసి సూచనలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి డీఎస్ చౌహాన్‌కు సూచించారు. అంతేగాకుండా డాక్టర్ ఎన్‌సి సక్సేనా కమిషనర్‌గా ఉన్న కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకోబోతున్నట్టు వెల్లడించారు.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిషనర్ హర్ష మండల్ సభ్యుడిగా ఉన్నారని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధి, విధానాలను అధికారుల బృందం అధ్యయనం చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో సుమారుగా 10లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.