10-07-2025 12:00:00 AM
- జూరాల నుంచి 1.87 లక్షల క్యూసెక్కులు రాక
- శ్రీశైలం నుంచి సాగర్‌కు భారీగా వరద నీరు
గద్వాల/నాగర్‌కర్నూల్, జూలై 9 (విజయక్రాంతి)/నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టులోకి 1,22,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 14 గేట్ల ద్వారా 1,26,365 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
దీంతో శ్రీశైలం ప్రాజక్టుకు 1,87,315 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు బుధవారం సాయంత్రం మూడు క్రస్ట్ గేట్లను పది ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199.74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులకు చేరింది.
ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్ 31,978 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌస్ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. సాగర్‌కు 1,17,868 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి 4,646 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం- 538 అడుగులు దాటింది.