calender_icon.png 11 July, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక కోడ్‌లను రద్దు చేసేదాకా పోరాడాలి

10-07-2025 12:00:00 AM

  1. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్

హుస్నాబాద్‌లో ప్రజాసంఘాల భారీ ప్రదర్శన

హుస్నాబాద్, జూలై 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్లబండి శశీధర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మిక చట్టాల రద్దు, ప్రజలపై భారాల మోత వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం  హుస్నాబాద్ లో సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది.

అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశీధర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికుల హక్కులను కాలరాసేలా కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ జీవో జారీ చేసిందన్నారు.

కార్మికుల శ్రమను దోచుకునే ఈ కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని, సంఘటిత, అసంఘటిత కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వెంటనే నిలిపివేసి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలన్నారు.

ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కల్లుగీత కార్మికులు తదితర రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ప్రదర్శనలో ప్రజా సంఘాల నాయకులు గూగులోతు శివరాజ్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్, రాజు, విక్రమ్, సతీశ్, రవీందర్, శ్రీకాంత్, సాయిలు, నాగేందర్, రాజయ్య, కొమురయ్య, సంపత్, వెన్నెల, విమల, స్వప్న, లత, రేణుక, ప్రశాంత తదితరులు పాల్గొన్నారు.