10-07-2025 08:28:14 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ బాసర ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలతో కలెక్టర్‌ను సత్కరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయంలో ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు శుద్ధమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలన్నారు.
క్యూలైన్లు, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, రద్దీ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రత పెంచడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్య బృందాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస సదుపాయాలు కల్పించాలని సూచించారు. గోదావరి స్నానఘట్టాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇంజినీరింగ్, పోలీసు అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవ్వరూ వెళ్ళకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భక్తులు బట్టలు మార్చుకునేందుకు తగిన గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన వసతిగృహాన్ని కలెక్టర్ పరిశీలించి, మరమ్మత్తుల నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఇన్‌చార్జి డిఆర్‌డిఓ శ్రీనివాస్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో అశోక్, పోలీసులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.