25-10-2025 01:26:22 AM
కాబూల్: అక్టోబర్ 24: పాకిస్థాన్‌కు జలా ల సరఫరాపై అడ్డుకట్ట వేయాలని తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయింది. ఈ మేరకు కునార్ నదిపై వీలైనంత త్వరగా ఆనకట్ట (డ్యామ్) నిర్మించాలని ఆఫ్గానిస్థాన్ అత్యున్నత నాయకుడు(సుప్రీమ్ లీడర్) మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్‌తో జలాల పంపకంపై ఆఫ్గానిస్థాన్‌కు ఎటువంటి అధికారిక ద్వైపాక్షిక ఒప్పందం లేని నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడ గమనార్హం.
సరిహద్దులలో కొనసాగుతున్న ఘర్షణలు, ఆఫ్గానిస్థాన్ నీటి సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. అయితే, ఆఫ్గానిస్తాన్ ఏకపక్ష చర్య ప్రాంతీ య జల సంక్షోభాన్ని పెంచుతుందని పాకిస్తాన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.
పొరుగు దేశాలపై ఆధారపడొద్దని..
2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత, తాలిబాన్ విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల విషయంలో పొరుగు దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం ఆనకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే కునార్ నదిపై డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది. కునార్ నది హిందూ కుష్ పర్వతాల్లో ఉద్భవించి, ఆఫ్గానిస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహించి అక్కడ అది కాబూల్ నదిలో కలుస్తుంది.
కాబూల్ నది పాకిస్థాన్‌లో ప్రవహించే ముఖ్యమైన సరిహద్దు నది. కునార్ నది ప్రవాహం తగ్గితే, కాబూల్ నది, ఆ తరువాత సింధూ నది ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఇది పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్సుల నీటి అవసరాలను, ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తుంది.