25-10-2025 01:28:23 AM
ఐదోసారి నితీశ్ సీఎం అవుతారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
బీహార్‌లో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం షురూ
ఎన్డీయే కూటమికి నితీశ్‌ను సీఎం చేయాలనే ఉద్దేశం లేదన్న తేజస్వీపై మండిపాటు
ఆధునిక కాలంలో ప్రజలకు ‘లాంతరు’తో పనిలేదని చురకలు
పాట్నా, అక్టోబర్ 24: జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీశ్‌కుమార్‌నే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమి సీఎం అభ్యర్థి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం ఆయన బీహార్‌లోని సమస్తీపుర్ జిల్లా కర్పూరీ పర్యటించారు. ఎన్డీయే కూటమి తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత భారతరత్న కర్పూరీ ఠాకూర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఠాకూర్ కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమికి మళ్లీ నితీశ్‌కుమార్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఉద్దేశం లేదని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో పాటు ఇండియా కూటమి (మహాఘట్బంధన్) నేతలు వ్యాఖ్యానించారని, ఎవరెన్ని చెప్పినా తమ కూటమి అభ్యర్థి నితిశ్‌కుమారేనని తేల్చిచెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
తమ కూటమి మునుపటి ఎన్నికల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ఆకాంక్షించారు. నితీశ్‌కుమార్ ఐదోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్ఠించడం ఖాయమని పేర్కొన్నారు. యువతకు సాధికారత కల్పించడమే తమ ధ్యేయమని తెలిపారు.
కర్పూరీ గ్రామంలో తాము నిర్వహించిన రోజ్‌గార్ మేళా ద్వారా 51 వేల మందికి కొలువులు వస్తాయని ఆకాంక్షించారు. ఇప్పుడు ప్రతి పౌరుడి చేతిలో అత్యాధునికమైన గాడ్జెట్లు ఉన్నాయని, ఇలాంటి ఆధునిక యుగంలో ‘లాంతరు’ (ఆర్‌జేడీ పార్టీ గుర్తు) అవసరం లేదని చమత్కరించారు.
రాజకీయాల్లో కర్పూరీది ప్రత్యేక స్థానం
బీహార్ రాజకీయాల్లో కర్పూరీ ఠాకూర్‌ది ప్రత్యేకస్థానమని ప్రధాని మోదీ కొనియాడారు. ఆ రంగంలో కర్పూరీ తనదైన ముద్ర వేశారని శ్లాఘించారు. కుల వివక్ష నిర్మూలనకు ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. అట్టడుగు వర్గాల వారికి దన్నుగా నిలిచి, వారిలో రాజకీయ చైతన్యస్ఫూర్తి రగిలించారని కొనియాడారు.
బీహార్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించారని, తద్వారా ‘ప్రజల నేత’గా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా గతేడాది భారత ప్రభుత్వం కర్పూరీ శత జయంతి వేడుకల సందర్భంగా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇచ్చి సముచిత గౌరవం కల్పించిందని వెల్లడించారు.