calender_icon.png 22 July, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల నేపథ్యంలో జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

21-07-2025 08:43:11 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వనపర్తి జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) అన్నారు. సోమవారం వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహచర మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేసి అప్రమత్తం చేశారు. సాగునీటి లభ్యత, వ్యవసాయం, రైతులకు కావాల్సిన ఎరువులు, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, రేషన్ కార్డుల పంపిణీ సహ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, సహా సంబంధిత అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు మండలాల వారీగా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పౌరసరఫరాల అధికారికి సూచించారు. అదేవిధంగా జిల్లాలో ఎన్ని ఎరువుల దుకాణాలు ఉన్నాయి, వాటిలో ఎరువుల లభ్యత గురించి బోర్డులు పెట్టేలా సంబంధిత దుకాణ యజమానులతో సమావేశం పెట్టి బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ విషయంపై వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేయాలని, బోర్డులు పెట్టని దుకాణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇక వ్యవసాయం కోసం నీటి లభ్యత, అవసరానికి అనుగుణంగా రైతులకు నీటిని విడుదల చేసే విధంగా వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ముందస్తు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విపత్తు నిర్వహణకు సంబంధించి మాడ్రిల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి విషయంలో ప్రతిరోజు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. అంటు వ్యాధుల విషయంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.