12 April, 2026 | 5:39 AM

నల్లగొండలో రహదారులకు మహర్దశ

08-12-2024 02:08 AM

నల్లగొండ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టింది. నూతన రహదారుల నిర్మాణం, విస్తరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం శనివారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

నల్లగొండలోని లతీఫ్ సాహెబ్ గుట్ట ఘాట్ రోడ్డు, బ్రహ్మంగారిమఠం శివాలయం రోడ్డు, అనిశెట్టి దుప్పలపల్లి ఖాజీరామారం రోడ్ల నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరు చేసింది. నల్లగొండ నకిరేకల్ పీడబ్ల్యూడీ, పజ్జూరు రోడ్లు విస్తరణకు, మర్మమతుకు రూ.20 కోట్లు కేటాయించింది.

సాగర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కనగల్ రోడ్డు వరకు, చర్లపల్లి నామ్ రహదారి నుంచి పిట్లంపల్లి వరకు, నార్కెట్‌పల్లి నుంచి మాండ్ర వరకు రహదారి విస్తరణ, మరమ్మతులకు రూ.44 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం 

నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శనివారం పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేశారు. నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంలలో రూ.674.67 కోట్లతో నిర్మించిన ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించి, అనంతరం డెలివరీ ఛానళ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరుకొని రెండో యూనిట్‌లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని స్విచ్‌ఆన్ చేసి గ్రిడ్‌కు అనుసంధానించారు.

అనంతరం సాయంత్రం 4.30 గంటల తరువాత నల్లగొండలోని గంధవారిగూడేనికి చేరుకొని రూ.250 కోట్లతో 42 ఎకరాల్లో సకల వసతులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మెడికల్ విద్యార్థులతో వైట్‌కోట్ సెర్మనీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి సమీపంలో రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభ స్థలానికి మంత్రులతో కలిసి సీఎం చేరుకున్నారు.

మొదటహైదరాబాద్ నుంచి బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి హెలిప్యాడ్ వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం స్వాగతం పలికారు.