గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసర పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యంగా పాత పుష్కర ఘాట్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, అవసరమైన చోట కొత్త ఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లను భక్తులకు కనువిందుగా ఉండేలా సుందరీకరించాలని, కళ్యాణ కట్ట, పిండ ప్రదాన వేదికలు, దుస్తులు మార్చుకునే గదులను తక్షణమే నిర్మించాలని సూచించారు. చేపట్టే ప్రతి నిర్మాణ పనిలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఘాట్ల సమీపంలో భక్తులకు తాగునీటి కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అలాగే, ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా బాసర ఆలయ మాస్టర్ ప్ల్పా కూడా చర్చించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, బాసర ఆలయ ఈవో అంజనా దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






