06-07-2025 01:15:30 AM
బనకచర్ల బర్నింగ్ టాపిక్‌గా నడుస్తోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే పార్టీల మాటల యుద్ధంలో ‘నంజుకోవడానికి’ రొయ్యల పులుసులు, మిర్చీ బజ్జీలు వచ్చి చేరాయి. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలేమో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నగరికి వెళ్లి మంత్రి రోజా ఇచ్చిన ఆతిథ్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కేసీఆర్ రోజా ఆతిథ్యంలో రొయ్యల పులుసు తిని గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకువెళ్లే అంశం పై మాట్లాడారని, దానినే అదునుగా ఇప్పుడు ఏపీ సర్కార్ బనకచర్ల కడుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే గులాబీ పార్టీ కూడా సీఎం కామెంట్లకు కౌంటర్‌గా విజయవాడకు మంత్రి ఉత్తమ్ వెళ్లినప్పుడు అక్కడ చంద్రబాబు ఇచ్చిన మిర్చీ బజ్జీలు తిని బనకచర్లకు పచ్చజెండా ఊపారని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. దీనితో బనకచర్ల ఇష్యూలో రొయ్యల పులుసు, మిర్చీ బజ్జీలే చక్రం తిప్పాయా అని చమత్కరించుకుంటున్నారు ప్రజలు.
తమ్మనబోయిన వాసు