05-10-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబరు 4 (విజయక్రాంతి ):జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని నగర ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన ఎర్రగడ్డ డివిజన్‌లో మొత్తం రూ. 2.69 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా ముందుకు సా గుతాయి అని అన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులను ప్రారంభించా మని తెలిపారు. పనులు తక్షణమే ప్రారంభమవుతాయని, నాణ్యత విషయంలో ఎలాం టి రాజీ ఉండదని అధికా రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.
స్థా నికంగా ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం పరికరాలతో ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, హైదరాబాద్‌లో ఇప్పటికే 60 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలను నిలబెట్టుకున్నాం, అని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అరులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా త్వరలో పంపిణీ చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బేగ్ ఖాద్రి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, కౌసర్ మొహినుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జీహెఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభమైన అభివృద్ధి పనుల వివరాలు..
మొదటగా, రూ. 2.16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్‌లలో సిమెంట్ కాంక్రీట్ సీసీ రోడ్ల నిర్మాణానికి, అలాగే నటరాజ్ నగర్, బంజారా నగర్‌లలోని కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా బోర్డు ఆధ్వర్యంలో రూ. 53 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను ప్రారంభించారు. దీని కింద శంకర్‌లాల్ నగర్, సంజయ్ నగర్‌లలో పాత మంచినీటి పైప్‌లైన్ల స్థానంలో కొత్తవి వేయడం, సుల్తాన్ నగర్, ఫాతిమా నగర్‌లలో మురుగునీటి లైన్ల భర్తీ పనులకు శంకుస్థాపన చేశారు.