calender_icon.png 5 October, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ బరిలో సినీనటి జయసుధ?

05-10-2025 12:00:00 AM

  1. ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం

సినీ గ్లామర్, వివాదరహిత ఇమేజ్ కలిసి వస్తాయనుకుంటున్న కమలనాథులు

ఆశావహులు కీర్తిరెడ్డి, దీపక్‌రెడ్డిలో తీవ్ర ఉత్కంఠ

అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

హైదరాబాద్,సిటీ బ్యూరో  అక్టోబర్ 4 (విజయక్రాంతి):  జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అనూహ్యంగా సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పేరు తెరపైకి వచ్చింది. ఆమె బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు యువనేతలు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న తరుణంలో జయసుధ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోందనే సంకేతాలు వెలువడుతుండడంతో భారతీయ జనతా పార్టీలో రాజకీయ సమీకరణా లు ఒక్కసారిగా మారిపోయాయి.

ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ

బీజేపీ రాష్ర్ట నాయకత్వం జూబ్లీహిల్స్ స్థానాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ నేత ఎన్. రాంచందర్‌రావు అక్టోబర్ 2న నేరుగా జయసుధ నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచన మేరకే ఈ భేటీ జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

గతంలో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలో ఉన్న సినీ గ్లామర్, పరిచయాలు, వివాదరహిత ఇమేజ్ జయసుధకు కలిసివస్తాయని, ఆమెను బరిలోకి దింపితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని పార్టీ నాయకత్వం భా విస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ భేటీలో ఏం చర్చించా రు? పోటీకి జయసుధ అంగీకరించారా..? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

గెలుపు గుర్రం కోసమే త్రిసభ్య కమిటీ

ఒకవైపు జయసుధ పేరు ప్రచారంలో ఉండగానే, మరోవైపు టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన లంకల దీపక్‌రెడ్డి, యువ నాయకురాలు కీర్తిరెడ్డి టికెట్ తమకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల మధ్య పోటీ తీవ్రం కావడంతో, అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు నిర్ణయించారు.

ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ న్యాయవాది కోసుల ఆంజనేయులుతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, నియోజకవర్గంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను బేరీజు వేసి, గెలుపు సామర్థ్యం ఉన్న అభ్యర్థి ఎవరనే దానిపై రాష్ర్ట నాయకత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది.