05-10-2025 01:01:57 AM
-ఉన్నత చదువుల కోసం వెళ్లిన చంద్రశేఖర్
-గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్
-కాల్పులు జరిపిన నల్ల జాతీయుడు
--బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో విషాదం
-సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 4: అమెరికాలో గన్ కల్చర్‌కు భారతీయ విద్యార్థులు బలవుతున్నారు. -ఉన్నత చదువుల కోసం వెళ్లి, డల్లాస్‌లో ఉంటూ, ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఎల్‌బీనగర్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన యువకుడిపై శుక్రవా రం నల్ల జాతీయుడు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఎల్‌బీనగర్‌లోని -బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచ ర్స్ కాలనీలో విషాదం నెలకొంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన పోలే జగన్‌మోహన్, సునీత దంపతులు 20 ఏండ్ల నుంచి బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీ, ఫేజ్ నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు దామోదర్, రాజ్ కిరణ్, చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్(27) మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ చదివేందుకు 2023లో అమెరికాలోని టెక్సాస్ రాష్ర్టం డల్లాస్‌కు వెళ్లాడు. చదువుకుంటూనే అక్కడ ఉన్న ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (స్థానికంగా “నీగ్రో”గా గుర్తింపు పొందిన నల్లజాతీయుడు) తన వాహనానికి ఇంధనం నింపే ఉద్దేశంతో స్టేషన్‌కు వచ్చాడు. గ్యాస్ నింపుతున్న సమయంలో అనూహ్యంగా అతడు చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై టెక్సాస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
అయితే, చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరామర్శించారు. వీలైనంత త్వరగా చంద్రశేఖర్ మృతదేహాన్ని ఇండియాకు రప్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన పోలే చంద్రశేఖర్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, తన ప్రగాఢ సానుభూతిని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎక్స్ వేదికగా శనివారం పేర్కొన్నారు.