calender_icon.png 5 October, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు రైతుకు.. కాంగ్రెస్‌కు.. భరోసా లేదు!

05-10-2025 01:20:36 AM

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం

విపత్తు సమయంలో ఏదీ అండ?

యూరియా కొరతతో రైతుల అరిగోస

సన్నాలకు బోనస్ అందలేదు.. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవు

ప్రతిపక్షాలకు కలిసి వచ్చే దిశగా కాంగ్రెస్ వైఫల్యాలు

ఆరుగాలం కష్టపడి రైతులు పండించే పంట చేతికి రావాలంటే అనేక ఆటుపోట్లను తట్టుకోవాలి. ఏ విపత్తు సంభ వించినా దాని ప్రభావం పడేది మొదటగా రైతాంగంపైనే. 

దుక్కి దున్నినప్పటి నుంచి చేతికొచ్చిన పంటను తూకం వేసే దాకా రైతులకు దినదిన గండమే. తెలంగాణలో ప్రస్తుత అకాల వర్షాలకు అన్న దాతలు ఆగమాగం అవుతున్నారు. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల అమలుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి  నెలకొన్నది. 

ప్రభుత్వ లోపాలు రైతులకు గుదిబండగా మారుతున్నాయి. సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో సన్నాలు పండించిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. బోనస్ నిధుల విడుదలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగం అంశం ఇప్పుడు కీలకంగా మారింది. 

రైతు సమస్యలు ‘స్థానికంగా’ ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలు కానున్నాయా?

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : ఈ ఏడాది తెలంగాణలోని రైతుల ను అత్యంత ఇబ్బందులకు గురి చేసిన అంశం యూరియా కొరత. గత దశాబ్ద కాలంగా ఏనాడు లేనంతగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే నెల రోజుల ముందువరకు ప్రతి పంటకూ యూరియా అవసరం ఉంటుంది. వర్షాకాం లో ప్రధానంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా సాగు చేస్తారు. ఈ పంటలన్నింటి పెరుగుదలకు యూరియా అవసరం ఎంతో ఉంటుంది.

అయితే గతం కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర  ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసింది. కానీ పెరిగిన సాగు విస్తీర్ణానికి తగినట్టుగా యూరియాను మాత్రం అందుబా టులో పెట్టలేకపోయింది. దీంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. యూరియా కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది యూరియా కేంద్రాల వద్ద ఎంతో మంది రైతులు బారులుదీరిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రైతులు తమ ఇంటిల్లిపాదితో సహా యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా కనీసం ఒక్క బస్తా కూడా దొరకని సందర్భాలు అనేకంగా ఉన్నాయి. యూరియా బస్తాల కోసం ఒకవైపు రాత్రి, పగలు తేడా లేకుండా క్యూలైన్లలో నిలబడటం, మరోవైపు రైతులు తమ చెప్పులను లైనుగా పెట్టేంత దయనీయ స్థితిని ఎదుర్కొన్నారు.

యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్  పెచ్చరిల్లింది. రూ. 266 ఉన్న యూరియా బస్తా రూ. 2 వేలకు పైగా పెట్టిన రైతులకు దొరకలేదు. దీంతో రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అయితే తప్పని పరిస్థితుల్లో అప్పు చేసిన అయినా ఎక్కువ ధర పెట్టేందుకు రైతులు సిద్ధపడినా సరైన సమయానికి యూరియా బస్తాలు లభించకపోవడంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు అటు ఆర్థికంగా, ఇటు పంట దిగుబడి రాక అన్ని విధాలా నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. 

కొరతకు గల ప్రధాన కారణాలు..

-కేంద్ర కోటా తగ్గింపు : యూరియా పంపిణీని నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానిదే. ఈ సీజన్‌లో కేంద్రం తెలంగాణకు గత ఏడాది కంటే 10 నుంచి 15 శాతం తక్కువ కోటాను కేటాయించింది. దీంతో డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యం దెబ్బ తిని రైతులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

-సాగు పెరుగుదల : ఆగస్టు చివరిలో అకస్మాత్తుగా వర్షాలు పెరిగిపోవడంతో రైతు లు పెద్దఎత్తున పంటల సాగు విస్తీర్ణం పెంచారు. దీంతో యూరియా డిమాండ్ ఒక్కసారిగా 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. అయితే రైతులకు అవసరం ఉన్న స్థాయిలో గోదాముల్లో యూరి యా నిల్వలు లేకపోవడంతో సమస్య తీవ్రమైంది. 

-దిగుమతిలో ఆలస్యం : యూరియా సరఫరా ఎక్కువగా రైల్వే మార్గం ద్వారా రాష్ట్రానికి చేరుతుంది. కానీ, కొంత కాలం గా రైలు షెడ్యూల్‌లో మార్పులు, లాజిస్టిక్స్‌లో సమస్యలు రావడంతో యూరి యా డెలివరీ ఆలస్యం అయింది. 

-బ్లాక్ మార్కెట్ : కొంతమంది ప్రైవేట్ ఎరువు డీలర్లు గోదాముల్లో నిల్వ ఉంచి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించారు. ఒక యూరియా సంచి ధర ను రూ.266గా ప్రభుత్వం నిర్ధారించినప్పటికీ బయట బ్లాక్ మార్కెట్‌లో రూ. 1000 నుంచి రూ. 2000లకు పైగా విక్రయించారు. అయినా రైతులకు యూరి యా బస్తాలు లభించలేదు.

-ప్రభుత్వ పర్యవేక్షణ లోపం : యూరి యా పంపిణీ ప్రస్తుతం ఆధార్ ఆధారిత డిజిటల్ సిస్టమ్‌లో జరుగుతుంది. అయి తే కొన్ని మండలాల్లో మెషీన్ కనెక్టివిటీ సమస్యలు, ఆధార్ లింక్ తప్పులు, సరఫరా రిజిస్ట్రేషన్ లోపాల వల్ల రైతులకు సమయానికి ఎరువులు అందలేదు. దీంతోపాటు కొన్ని జిల్లాల్లో అధికారులు సమయానికి స్టాక్ వివరాలు అప్‌డేట్ చేయకపోవడం, డిపో స్థాయి తనిఖీలు జరగకపోవడంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. 

ధాన్యం కొనుగోలు కష్టాలు.. 

ప్రస్తుతం తెలంగాణలో రైతాంగం పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు చేర్చే వరకు నమ్మకం లేకుండా పోతుంది. ఎప్పుడు అకాల వర్షాలు సంభవించి ధాన్యం, ఆయా పంటలు నీటి మునుగుతాయో తెలియని దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వానల్లో తడుస్తూ, క్యూలో నిలబడి ధాన్యం సంచులు కాపాడుకోవడం వంటివి రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న అనేక సమస్యలే దీనికి ప్రధాన కారణం.

అనేక సమస్యలు రైతులను చుట్టుముడుతున్నా ప్రభుత్వ పట్టింపు మాత్రం అంత మాత్రంగానే ఉంది. పంటలు చేతికి రాకముందు అనేక ప్రకృతి విపత్తులు, చేతికి వచ్చాక కొనుగోలు సమస్యలు రైతులను చుట్టుముడుతున్నాయి. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని పంటలను కొనుగోలు కేంద్రాలకు చేర్చితే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అకాల వర్షాల నుంచి ధాన్యం కాపాడటం ఒక ఎత్తు అయితే, దురదుష్ట వశాత్తు తడిసిన ధాన్యాన్ని అమ్మడం మరొక ఎత్తు అవుతుంది. ధాన్యం తూకం వేసే దాకా రైతులకు పెద్ద గండంలా మారుతుంది. 

-తిరస్కరణకు గురవుతున్న తడిసిన ధాన్యం : అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లితే అధికారులు తేమ శాతం ఎక్కువగా ఉందని తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు ధాన్యం ఎండబెట్టడానికి అనేక తిప్పలు పడుతున్నారు. 

-ఎంఎస్సీ కంటే తక్కువ ధర : ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్సీ) అమలు కావడం లేదు. కొన్ని చోట్ల మధ్య వర్తులు తక్కువ ధరకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాలు సరైన సమయంలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తక్కువ ధరకే బయట అమ్మకాలు చేపడుతున్నారు. 

-కొనుగోలు కేంద్రాల లోపాలు : కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండటంతో ధాన్యం విక్రయించేందుకు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. బరువులు కొలిచే పరికరాలు తగినన్ని లేకపోవడంతో అనేక ఇబ్బందుల తలెత్తుతున్నాయి. సంచులు, కవర్లు, నిల్వ సదుపాయం లేకపోవడంతోపాటు అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రధాన లోపంగా ఉంది. 

-చెల్లింపుల్లో ఆలస్యంతో రైతులపై రుణభారం : ధాన్యం అమ్మిన తర్వాత కూడా చెల్లింపుల కోసం రైతులు వారాల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడంతో రైతులు తర్వాత సీజన్ సాగు కోసం మళ్లీ అప్పు చేస్తున్నారు. దీంతో రైతులపై అధిక భారం పడుతుంది. 

-రవాణా సమస్యలు : ధాన్యం తరలించడానికి ప్రభుత్వం తగిన వాహన సదుపాయం కల్పించకపోవడంతో రైతులే ట్రాక్టర్, లారీ వంటి వాహనాలను కిరాయికి తీసుకోవాల్సి వస్తుంది. దీని ద్వారా ప్రతి ఎకరానికి రూ. 500 నుంచి రూ. 1000 వరకు అదనంగా ఖర్చు అవుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్‌కు గడ్డు కాలమే... 

బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వైఫల్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చాలా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మెజార్టీ శాతం ఉన్న రైతుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల పరిస్థితులను ఏర్పరచుకోలేక పోతుంది. మిగిలిన పథకాలను పక్కనపెడితే రైతు భరోసా, రుణ మాఫీ వంటి రైతులకు సంబంధించిన పథకాల అమలులో విఫలమైందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది.

పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడటంతోపాటు ఇటు అకాల వర్షాల సమయంలో రైతులకు అండగా నిలబడకపోవడం, యూరియా కొరతను అరికట్టలేకపోవడంతో రైతుల్లో ఆగ్రహానికి కారణమైంది. అయితే వర్షాలు, వరదలకు భారీగా నష్టం వాటిల్లడం, యూరియా కొరతతో ఆర్థికంగా నష్టపోవడం, పంట దిగుబడి తగ్గడం, పండిన సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, గత సీజన్‌కు సంబంధించిన బోనస్ డబ్బులు ఇప్పటికీ విడుదల చేయకపోవడం వంటి అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం తప్పేలా లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

అకాల వర్షాలతో తీరని నష్టం..

తెలంగాణలో అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు జల్లాయి. విత్తనాల నుంచి ధాన్యం దాకా ప్రతి దశలోనూ కష్టపడ్డ రైతు చేతుల్లో ఇప్పుడు నష్టాలే మిగిలాయి. ప్రకృతి విలయంతోపాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కూడా ఆలస్యం కావడం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగమయ్యారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు నీట మునిగి రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. భారీగా పోటెత్తిన వరదలతో వరి, పత్తి, మొక్క జొన్న, సోయాబీన్, పప్పుధాన్యాల పంటలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది. తెలంగాణ వ్యాప్తంగా 2.36 లక్షల ఎకరాల పంట నష్ట పోయినట్టు ప్రభుత్వం అంచనా వేసింది.

నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల పరిహారం అందించాలని నిర్ణయించింది. అయితే ప్రభు త్వం అందించే పరిహారం రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చడంలో నామమాత్రంగానే ఉంది. పరిహారం పేరిట ప్రభుత్వం అందించే భరోసాతో రైతులకు ఎలాంటి స్వాంతన లభించే అవకాశం లేదని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది సరిపోక, అటు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 1.09 లక్షల ఎకరాల వరి, 60 వేల ఎకరాల పత్తి, 21 వేల ఎకరాల సోయాబీన్, 16 వేల ఎకరాల మొక్కజొన్న, 6 వేల ఎకరాల హార్టికల్చర్ పంటలు, 20 వేల ఎకరాలకు పైగా ఇతర పంటలకు నష్టం వాటిల్లింది.

ప్రభుత్వం నష్ట పోయిన పంటలకుగానూ ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి రైతుల లెక్క ప్రకారం ఒక ఎకరా వరి సాగు చేసేందుకు రూ. 40 వేలు, ఎకరా పత్తి సాగు చేసేందుకు రూ. 45 వేలు, ఎకరా మొక్కజొన్న సాగు చేసేందుకు రూ. 38 వేలు, ఎకరా సోయాబీన్ సాగు చేసేందుకు రూ. 20 వేల ఖర్చు వస్తుంది. ఈ నేపథ్యం లో ప్రభుత్వం అందించే రూ. 10 వేల పరిహారం ఎకరా విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసేందుకు అయ్యే పెట్టుబడిలో కేవలం 25 శాతంగా మాత్రమే ఉంటుంది. అయితే అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా జరిగిన జరిగిన నష్టానికి.. ప్రభుత్వాలు ఇచ్చే పరిహారానికి పొంతనే లేదని రైతులు వాపోతున్నారు. 

రైతులకు ‘బోనస్’ కష్టాలు.. 

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 రబీ సీజన్‌కు సంబంధించిన సన్న వడ్ల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ ఆ తర్వాత బోనస్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నది. ఇప్పటివరకు 2024 రబీ సీజన్‌కు సంబంధించిన సన్న వడ్ల బోనస్ నిధులు ఇంకా రైతులకు చేరలేదు. ఆ నిధుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి.

కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఇప్పటికీ సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ఇప్పటికే గత సంవత్సరానికి సంబంధించిన బోనస్ డబ్బులే రాక నిరాశలో ఉన్న రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్న వడ్లు పండించిన రైతులందరూ చేసేదేమీ లేక ధాన్యాన్ని ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ కొనుగోలుదారులు రైతుల ధాన్యానికి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతులకు మరోదారి లేక ప్రైవేట్ వ్యక్తులకే ధాన్యాన్ని అమ్మినా వారు పంట డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు.

ఒక్కోసారి ఆలస్యంగా రావొచ్చు, లేక మొత్తానికే ఎగ్గొట్టే అవకాశమూ లేకపోలేదు. దీంతో సన్న వడ్లు పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి సన్న బియ్యం భారీగా తెలంగాణకు వచ్చేది. కానీ ప్రభుత్వం చెక్‌పోస్టులను అప్రమత్తం చేసిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో దానికి అడ్డుకట్ట వేయగలిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణలోనే రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం లభిస్తుండటంతో కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొనుగోలుదారులు ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లు పండించిన రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. 

-మార్కెట్ యార్డుల్లో గందరగోళం : కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపామని, ఇంకా నిధులు మంజూరు కాలేదని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని మండలాల్లో బోనస్ మంజూరు జాబితాలు సిద్ధమైనా ఫైనాన్స్ విభాగం నుంచి నిధులు విడుదల కాలేదు.

-స్పష్టత లేకపోవడం : వివిధ జిల్లాల మార్కెట్ కమిటీల్లో అధికారులకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఒకవైపు ధాన్యం రవాణా పూర్తవుతున్నాయి. మరోవైపు బోనస్ బకాయిలు పేరుకుపోతున్నాయి. 

-రైతులపై తీవ్రం భారం : బోనస్ డబ్బు విడుదల కావడం ఆలస్యం కావడంతో రైతులు బ్యాంకుల రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలను తీర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది రైతులు తదుపరి పంటకు పెట్టుబడులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రతిపక్షాలకు కలిసివచ్చే అంశమిది.. 

తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉండి గత ఎన్నికల్లో గద్దె దిగిన బీఆర్‌ఎస్‌కు మళ్లీ పుంజుకునేందుకు, ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురు చూస్తున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం కల్పిస్తున్నది. రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే వ్యవసాయ రంగంపై, రైతాంగంపై ప్రతిపక్షాలు ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ప్రకృతి విపత్తు సమయంలో రైతులకు అండగా ఉండటంలో ప్రభుత్వం విఫలమైంది.

ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంది. దీంతో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురుకానున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రైతుల సమస్యలను బీఆర్‌ఎస్ పార్టీ ప్రధానంగా ఎత్తి చూపుతుంది. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. వాస్తవానికి గత పదేళ్ల పాలనలో యూరియా కొరత కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వాడుకోనున్నది. సరైన సమయంలో ఎరువులు అందించడంతోపాటు రైతు బంధు, రుణ మాఫీ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపలేదు.

ఈ అంశాలు రైతుల్లో బీఆర్‌ఎస్ పట్ట సానుకూల పరిస్థితులను కలుగజేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు బీమా అందించడంలో, యూరియా కొరత ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీనే కారణమని అధికార కాంగ్రెస్ వాదిస్తున్నది. ప్రస్తుతం రైతుల పడుతున్న ఇబ్బందులు పడటంలో తమ తప్పేంలేదని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతోపాటు రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన అవసరాలను కేంద్రానికి వివరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రైతు భరోసా, రుణమాఫీ ప్రభావం..

గత ప్రభుత్వం రైతు బంధు పేరిట రెండు విడతలుగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతులకు అందించేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 12 వేలు మాత్రమే ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం రెండు విడతల మాత్రమే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసింది. అందులోనూ మొదటి సారి వేసినప్పుడు కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఇచ్చింది.

రెండో విడత అందరికీ ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఇచ్చినా, రాష్ట్రంలోని చాలా మందికి రైతులకు రైతు భరోసా నిధులు జమ కాలేదు. ఆయా కారణాలు చెబుతూ ప్రభుత్వం వారి ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయలేదు. దీనికి తోడు రుణమాఫీకి సంబంధించి కూడా రూ. 2 లక్షల వరకు మాఫీ చేసినా, రాష్ట్రంలో అనేక మంది రైతులు రూ. 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు రైతు భరోసా నిధులు జమ కానీ వారు, ఇటు రుణాలు మాఫీ కాని రైతులందరూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా మొత్తం వచ్చింది. కానీ రైతులకు సరిగా పంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. యూరియా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకున్నారు. వరి కోతకు వచ్చినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. రైతులను నట్టేట ముంచే ప్రభుత్వం ఇది. రైతాంగాన్ని పూర్తిస్థాయిలో మోసం చేస్తుంది. అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినా జరిగిన నష్టం అంచనా వేయడంలో, బాధిత రైతులను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 

 బస్వ లక్ష్మీనర్సయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు

రైతులకు బోనస్ ఇచ్చిందే లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. ఇప్పటికే అనేకసార్లు వ్యవసాయ శాఖ మంత్రి, రైతు కమిషన్‌కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. రైతులకు తగిన విధంగా క్రాప్ లోన్ ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వరదల కారణంగా లక్షల ఎకరాల నష్టం వాటిల్లినా పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

ఇప్పటికీ రాష్ట్రంలో 2 నుంచి 3 లక్షల టన్నుల యూరియా లోటు ఉంది. యాసంగి ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కావాల్సిన యూరియా ఇంకా అందుబాటులోకి రాలేదు. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు లేవు, విత్తన చట్టమే లేదు. రుణమాఫీ కూడా ఇంకా చాలా మందికి రావాల్సి ఉంది. సన్న వడ్లకు బోనస్ కింద రూపాయి ఇచ్చిందే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. సారంపల్లి మల్లారెడ్డి, కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు