calender_icon.png 5 October, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవేశం లేదు!

05-10-2025 01:06:15 AM

బీఏఎస్ బకాయిలపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పట్టు

-దసరా సెలవులు ముగియడంతో పిల్లలకు అనుమతి నిరాకరణ 

-మూడేళ్లుగా 250 కోట్ల బకాయిలు

-నిధులైనా ఇవ్వండి.. స్కీమైనా ఎత్తేయండి 

-స్కూళ్లు నడపలేమంటున్న యాజమాన్యాలు

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) కింద నడిచే రాష్ట్రంలోని ప్రైవే ట్ పాఠశాలల్లో పిల్లలను ఇకమీదట అనుమతించబోమని ఆయా పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ప్రభు త్వం పెండింగ్ బకాయిలిస్తేనే స్కూళ్లకు అనుమతిస్తామని తెగేసి చెబుతున్నాయి.

పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుండా స్కూళ్లను నడిపే పరిస్థితి లేదని అంటున్నాయి. అప్పులు తెచ్చి పాఠశాలలను ఇక నడపలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా సెలవులు ముగియడంతో పాఠశాలలు శని వారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలన్నీ పిల్లలను అనుమతించవద్దని బెస్ట్ అవైలబుల్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ మేరకు  విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు.  

మూడేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2023 2024 2025 విద్యాసంవత్సరంతోపాటు పాతవి కొన్ని కలుపుకొని దాదాపు రూ.250 కోట్ల వర కు 237 స్కూళ్లకు రావాల్సి ఉంది. ఇందు లో 2023 రూ.100 కోట్లు, 2024 25 రూ.100 కోట్లు, 2025 రూ.50 కోట్లు. అయితే ఈ నూతన విద్యాసంవత్స రం ప్రారంభంలో పెండింగ్ నిధులు విడుదల చేస్తే గానీ, విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వబోమని ఆయా స్కూల్ యాజమాన్యాలు ప్రకటించడంతో ఒకట్రెండు రోజుల్లో నిధులన్నీ విడుదల చేస్తామని ఈఏడాది జూలైలో  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. అలాగే జిల్లాల కలెక్టర్లు స్కూళ్లకు లేఖలు రాయడంతో పిల్లలకు అడ్మిషన్లను కల్పించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదు. 

డెడ్‌లైన్ ముగియడంతో..

సెప్టెంబర్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు సెక్రటరీలకు, కమిషనర్లకు స్కూల్ యాజమాన్యాలు కలిసి తమ గోడును వినిపించుకు న్నాయి. సెప్టెంబర్ 20లోగా నిధులు విడుదల చేయకుంటే దసరా సెలవుల తర్వాత తాము పాఠశాలలను నడపలేమని, పిల్లలను పాఠశాలలకు అనుమతించబోమని లేఖలు రాశాయి. కానీ ఇప్పటి వరకు నిధులు విడుదలకాకపోవడంతోనే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.

నిర్వహణ భారం తడిచిమోపెడు 

ఒక్కో జిల్లాలో 5 నుంచి 10 వరకు బీఏఎస్ స్కూళ్లు ఉన్నాయి. అయితే, ఒక్కో స్కూల్‌కు కనీసం రూ.50 లక్షల నుంచి అత్యధికంగా రూ.6 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిజామాబాద్‌లోని ఓ స్కూల్‌కు దాదాపు రూ.3.5 కోట్లు రావాల్సి ఉండగా, కరీంనగర్‌లోని ఓ స్కూల్‌కు రూ.2 కోట్లు నిధులు రావాలి. ఒక్కో స్కూళ్లో కనీసం 100 నుంచి 500 మంది వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ స్కీం కింద చదువుకుంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది విద్యార్థులుంటారు. హాస్టల్ విద్యార్థి ఒక్కొక్కరికి రూ.42 వేలు, డేస్కాలర్ విద్యార్థికి రూ.28 వేలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ స్కీం కింద చేరే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్‌లు, కాస్మోటిక్స్, మంచి భోజనం పాఠశా లల యాజమాన్యాలు అందించాల్సి ఉంటుం ది. అయితే, మూడేళ్లుగా నిధులు విడుదలకాకపోవడంతో విద్యార్థులకు భోజనం పెట్టేందు కు డబ్బులు కూడా లేవని స్కూల్ యాజమాన్యాలు వాపోతున్నారు. నిర్వహణ భారం ఎక్కువవుతుందని, నెలకు రూ.9 లక్షలు ఖర్చు వస్తుందని ఓ స్కూల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. 

మా డబ్బులు మాకివ్వండి

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వానికి దండం పెడుతున్నాం.. మా డబ్బులు మాకివ్వండి. అప్పులు తెచ్చి స్కూళ్లు నడుపుతున్నాం. ఇక నడపలేం. అప్పులు బాధతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా గోడును వినిపించుకోవాలి. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పిల్లలను అనుమతించం. శనివారం నుంచే అనుమతించమని ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా పేరెంట్స్‌కు మెస్సేజ్‌లు పెట్టాం.

 యాదగిరి శేఖర్ రావు ట్రస్మా గౌరవ అధ్యక్షుడు, బీఏఎస్ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి

స్కీంను ఎత్తేయండి

ప్రభుత్వం బకాయిలను విడుదల చేయనప్పుడు ఈ స్కీం ఎత్తేయండి. లేకుంటే నిధులైనా ఇవ్వండి. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, భోజనం ఏ విధంగా పెట్టాలి. విద్యార్థులకు తిండి కూడా పెట్టలేకపోతున్నాం. అప్పులు ఎంతకని తెచ్చి పెట్టాలి. ప్రభుత్వం కొన్ని నెలలుగా ఇస్తామంటుందే కానీ ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. నిధులు విడుదలయ్యేంత వరకు పిల్లలను స్కూల్‌కు అనుమతించం. పాఠశాల యాజమాన్యానికి పేరెంట్స్ సహకరించాలి. 

 జయసింహ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం