05-10-2025 01:00:21 AM
-కొండాపూర్‌లో ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
-హైకోర్టు తీర్పు అమలుతో కబ్జాదారులకు షాక్
-పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణల కూల్చివేత
శేరిలింగంపల్లి, అక్టోబర్ 4: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో ఆక్రమణకు గురైన రూ.3,600 కోట్లు విలుచేసే 36 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. కబ్జా నుంచి హైడ్రా అధికారులు కాపాడారు. ఆ భూమిలో వెలసిన ఆక్రమణలను శనివారం పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు.
కొండాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతి నగర్ ప్రాంతంలో సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. కొందరు ఆ భూమిని ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా ఆ భూములు గత 60 ఏళ్లుగా తమ అధీ నంలోనే ఉన్నాయని కొంతమంది రైతులు చెపుతూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ కొన్ని రోజుల క్రితం కోర్టు తీర్పునిచ్చింది.
ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఆ భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ హైడ్రాకు కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో హైడ్రా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శనివారం ఉదయం నుంచే కూల్చివేతలు చేపట్టిన అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పే బోర్డులు పాతి, ఆ భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.