01-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): ఆర్టీసీ పరిరక్షణ కోసం గత ప్రభుత్వ హాయంలో చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్న ఆందోళనకారులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని సిపిఐ నాయకుడు అజయ్ సారధి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మానుకోట పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా తాము పాల్గొన్నామని, ఈ నేపథ్యంలో తమపై కేసులు పెట్టారని చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు దశలవారీగా పరిష్కరించినప్పటికీ, తమపై పెట్టిన కేసులు ఎత్తివేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కేసులు ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, ఎండి మహమూద్, మంద శంకర్, జలగం ప్రవీణ్, మిర్యాల మల్లికార్జున్, ఎండి షంషీర్, పద్మ, షరీఫ్ తదితరులు ఉన్నారు.