లేటరల్ ఎంట్రీపై రగడ
- రిజర్వేషన్ల అంతానికేనన్న రాహుల్‌గాంధీ
- ఇందులోనూ రిజర్వేషన్లు ఉన్నాయన్న సర్కారు
- ఈ విధానమే తప్పు అన్న కేంద్రమంత్రి చిరాగ్
- మోదీ సర్కారుకు మిత్రపక్షాల నుంచే సెగ
న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత అధికార పోస్టులను ప్రభుత్వ ఉద్యోగులతో కాకుండా బయటి వ్యక్తులతో భర్తీ చేయటంపై మోదీ ప్రభుత్వానికి సొంత మిత్రుల నుంచే సెగ మొదలైంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తేసేందుకే మోదీ సర్కారు లేటరల్ ఎంట్రీని తెరపైకి తెచ్చి దొడ్డిదారిన కార్పొరేట్లకు అత్యంత కీలక పదవులు కట్టబెడుతున్నదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం ధీ విమర్శలు గుప్పించిన మరుసటి రోజే సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రే ఆయనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేశారు. దీంతో మోదీ సర్కారుపై ఈ అంశంలో ఒత్తిడి పెరుగుతున్నది. అయితే, లేటరల్ ఎంట్రీలోనూ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు.
దొడ్డిదారిన భర్తీ
కేంద్ర శాఖల్లోని అత్యంత కీలకమైన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్, డిఫ్యూటీ సెక్రటరీ వంటి పదవులను గతంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కేంద్ర సర్వీస్ సీనియర్ అధికారులతో భర్తీ చేసేవారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ‘ప్రభుత్వంలో అత్యంత నిపుణులైన వ్యక్తులను భాగస్వాములను చేయటం’ అన్న కారణం చెప్పి కార్పొరేట్ రంగాలకు చెందిన ప్రైవేటు వ్యక్తులను సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్, డిఫ్యూటీ సెక్రటరీ పోస్టుల్లో నియమించటం మొదలుపెట్టింది. ఈ విధానంపై మొదట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ప్రభు త్వం వెనక్కు తగ్గలేదు.
తాజాగా 24 మంత్రి త్వ శాఖల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా 45 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ సర్కారు రిజర్వేషన్లను పూర్తిగా రద్దుచేసేందుకే ఈ వ్యవ స్థను తీసుకొచ్చిందని ఆరోపించారు. లేటరల్ ఎంట్రీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేయటం లేదని ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపణలు గుప్పించాయి. అత్యున్నత స్థాయి పోస్టులకు ఈ వెనుకబడిన వర్గాలను కుట్రపూరితంగా మోదీ సర్కారు దూరం చేస్తున్నదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు.
రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం: కేంద్రం
ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. లేటరల్ ఎంట్రీపై కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలు చేస్తున్నదని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విధానంలోనే లేటరల్ ఎంట్రీ పోస్టులను భర్తీ చేస్తున్నామని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
- 2017లో నీతీ ఆయోగ్, సెక్టోరల్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఎస్‌జీఓఎస్) సిఫారసుల మేరకు లేటరల్ ఎంట్రీ విధానాన్ని మోదీ ప్రభుత్వం 2018 నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి పోస్టుల్లో నిపుణుల కొరతను భర్తీచేసేందుకు ఆల్ ఇండియా సర్వీస్ అధికా రులను కాకుండా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను లేటరల్ ఎంట్రీ ద్వారా కీలక పదవుల్లో నియమిస్తున్నారు.
- ఈ విధానంలో మూడేండ్ల కాలానికి నిపుణులను వివిధ పోస్టుల్లో నియమిస్తారు. పదవీకాలాన్ని ఐదేండ్ల వరకు పొడిగించేందుకు వీలున్నది. ఇందులో అత్యున్నత పోస్టు సంయుక్త కార్యదర్శి.
- 2018 నుంచి లేటరల్ ఎంట్రీ ద్వారా 63 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో 35 మంది ప్రైవేటు రంగం నుంచి వచ్చినవారు.
- లేటరల్ ఎంట్రీలో రిజర్వేషన్లను అమలుచేయటం లేదు. ఒక్కో శాఖలో ఒకే క్యాడర్ పోస్టును లేటరల్ ఎంట్రీ ద్వారా ఒక్కటే భర్తీ చేస్తున్నందున ఇందులో రిజర్వేషన్లను వర్తింపజేయటం లేదని ప్రభుత్వం చెప్తున్నది.
ఈ విధానం పూర్తిగా తప్పు: చిరాగ్ పాశ్వాన్
లేటరల్ ఎంట్రీ ద్వారా అర్హులైన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను పక్కబెట్టి బయటి వ్యక్తులకు ఉన్నత పోస్టులు కట్టబెట్టడం పూర్తిగా తప్పు అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సోమవారం వ్యాఖ్యానించారు. అన్ని ప్రభుత్వ నియామకాలు రిజర్వేషన్లకు లోబడే భర్తీ చేయాలని తన సొంత ప్రభుత్వానికే సూచించారు. ‘నేను మా పార్టీ తరఫున మాట్లాడుతున్నా. లేటరల్ ఎంట్రీ విధానానికి మేం ఏమాత్రం అనుకూలం కాదు. ఇది పూర్తిగా తప్పు. ప్రభుత్వం ముం దు ఈ అంశాన్ని నేను లేవనెత్తుతాను’ అని ప్రకటించారు. లేటరల్ ఎంటీ విధానం వెనుక భారీ కుట్ర ఉన్నదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.






