26-07-2025 12:35:41 AM
న్యూఢిల్లీ, జూలై 25: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఐదో రోజైన శుక్రవారం నిరసనలతో దద్దరిల్లాయి. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్‌ఐఆర్)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నిరసనలతో హోరెత్తించింది. దీనిపై సభలో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇండియా కూటమి ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు డస్ట్‌బిన్‌లతో పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు.
ఐదో రోజు మొదలైన లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇక పెద్దల సభలో కూడా ‘సర్’పై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో సభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. 2 గంటల తర్వాత లోక్‌సభ తిరిగి సమావేశం అయినప్పటికీ నిరసనలు చెలరేగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఉభయసభలు వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తన చాంబర్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ పార్టీల సీనియర్ నేతలను కోరారు.
సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరిపేందుకు కేంద్రం అంగీకరించింది. 28న లోక్‌సభలో, తర్వాతి రోజు రాజ్యసభలో చర్చించనున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపును అన్ని పార్టీలు సమర్థించాయని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఎన్నికల సంఘం రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించింది.