16-02-2026 12:00:00 AM
కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక
మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక
ఏర్పాట్లు చేసిన అధికారులు
మంచిర్యాల, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : జిల్లాలోని మంచిర్యాల నగరపా లక సంస్థ, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ లతో ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారాలు చేయించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్లలో విజయం సాధించిన అభ్యర్థుల(కార్పొరేటర్ల)తో ఉదయం మంచిర్యాలలోని కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఏర్పా టు చేసిన ప్రమాణస్వీకార మహోత్సవంలో ప్రత్యేక అధికారి, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అలాగే బెల్లంపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన 34 మంది వార్డు కౌన్సిలర్ లతో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి మనోజ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ లు, చెన్నూర్ మున్సిపాలిటీలో విజయం సాధించిన 18 మంది వార్డు కౌన్సిలర్లతో చెన్నూర్ ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణలు, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ నుంచి విజయం సాధించిన 22 మంది కౌన్సిలర్లతో క్యాతనపల్లి స్పెషల్ ఆఫీసర్, మందమర్రి తహశీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో విజయం సాధించిన 15 మంది వార్డు కౌన్సిలర్లతో మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, తహశీల్దార్ దిలీప్ కుమార్, కమిషనర్ విజయ్ కుమార్ లు ఆయా మున్సిపాలిటీల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రమాణం చేయించనున్నారు.
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్ర మే ఈ ఎన్నికలలో పాల్గొని ముందుగా చైర్ పర్సన్, తర్వాత వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. సభ్యులు ఈ ఎన్నికల్లో పరోక్ష పద్దతిలో వారికి నచ్చిన అభ్యర్థికి చేయి పైకి ఎత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బందోబస్తు ఏర్పాటు చేశారు.