01-01-2026 01:31:18 AM
ఎన్నికలు తాత్కాలికం, ప్రభుత్వం శాశ్వతం
ఎమ్మెల్సీ దండే విఠల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్31 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి సాధ్యం అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గం దహేగం మండలంలోని భామనగర్, కుంచవెల్లి గ్రామాలలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. ఎన్నికలు తాత్కాలికమని, ప్రభు త్వం శాశ్వతమని, ప్రభుత్వాలు చేసిన మంచి పనులే చరిత్రలో నిలిచిపోతాయని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.