10-07-2025 08:06:38 PM
రైతులకు అధికారులు అవగాహన కలిపించాలి..
సామాజిక కార్యకర్త, కర్నె రవి
మణుగూరు (విజయక్రాంతి): మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో పల్లె రోడ్లు దమ్ము చక్రాల వాహనాల వలన ధ్వంసం అవుతున్నాయని, సామాజిక కార్యకర్త, నాయ్యవాది కర్నె రవి(Social activist Karne Ravi) ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీప్ సాగు నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలలో దమ్ము చక్రాలతో ట్రాక్టర్ల రాకపోకల కారణంగా రహదారులు ఛిద్రమవుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారుల మీదుగా దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు ప్రయాణిస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంఫై సంబంధిత ప్రాంత ప్రజలు, అధికారులు బాధ్యతగా తీసుకుని రోడ్లపై దమ్ము చక్రాల ట్రాక్టర్ ల రాకపోకలను కట్టడి చేయాలని కోరారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రహదారులపై వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిపించాలన్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులతో పాటు రహదారుల శాఖ, పోలీసులు సమన్వయంగా స్పందించి చర్యలు తీసుకోవాలని రవి విజ్ఞప్తి చేశారు.