29-09-2025 07:13:55 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు చివరి రోజు సోమవారం ఘనంగా జరిగాయి. మహిళలంతా ఓకే చోట చేరి ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తిరొక్క పువ్వులతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. పెద్ద ఎత్తున వేలాదిమంది మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడుతూ పాటలు పాడారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో.... పాతవాడలోని శివాలయం వద్ద.... శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద... గాంధీనగర్.. జవహర్ నగర్ తో పాటు పలుచోట్ల... సుల్తానాబాద్ మండలంలోని గ్రామాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.
సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక పెద్ద చెరువులో బతుకమ్మలను మహిళలు నిమజ్జనం చేశారు.... స్థానిక పెద్ద చెరువు వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం ఏలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇతరత్రా ఏర్పాట్లు చేయడం జరిగింది.. పెద్ద చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ...పెద్ద ఎత్తున పోలీసులను ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న అమ్మవారి బతుకమ్మ....
సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా అమ్మవారు ఎత్తుకున్న బతుకమ్మ సోమవారం రాత్రి ఆర్యవైశ్య భవన్ లో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. కొమురవెల్లి లక్ష్మి.. అఖిల.. తయారుచేసిన అమ్మవారు ఎత్తుకున్న బతుకమ్మ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది.