18 April, 2026 | 2:22 AM

నిబంధనలు పాటించడంతోనే భద్రత: ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

18-04-2026 12:35 AM

కొండరెడ్లకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ

దమ్మపేట, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలోని వినాయక ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు, నివారణపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్లతో కలిసి ఆయన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అటు సైబర్ నేరాలు, ఇటు రోడ్డు ప్రమాదాలు సమాజానికి పెద్ద సమస్యగా తయారయ్యాయని, వీటి పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.   మనిషి ఇంట్లో ఉంటే సైబర్ నేరగాళ్లు, బయటకు వస్తే రోడ్డు ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల్లో డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చని, కానీ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం పోతే తిరిగి పొందలేమని ఆయన స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2025 సంవత్సరంలో  248 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం తనను ఎంతో కలచివేసిందన్నారు. ఖమ్మం- అశ్వారావుపేట ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారిందని, అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రీన్ ఫీల్ రహదారి వల్ల స్థానిక రోడ్లపై రద్దీ తగ్గి ప్రమాదాలు 50 శాతం మేర తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం వల్లే అత్యధికంగా ప్రాణాలు పోతున్నాయని వివరిం చారు.  మండలంలోని పూసుకుంట గ్రామానికి చెందిన కొండరెడ్లకు  ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా, శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు యువతకు డ్రైవింగ్ లైసెన్సులను అందజేశారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు రక్షణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని  సూచించారు.

నిబంధనల పాటించడంతోనే భద్రత: కలెక్టర్, ఎస్పీ 

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ‘అరైవ్ అలైవ్’ ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనల ఉల్లంఘనపై పోలీసు శాఖ రాజీపడదని, తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.  డీఎస్పీ సతీష్, ఏఎంసీ చైర్మన్ వాసం రాణి, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండలంలోని నాయకులు  పాల్గొన్నారు.