22-07-2025 04:42:08 PM
- డిపాజిట్లు చెల్లించని సహారా యాజమాన్యం..
- కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు..
మంచిర్యాల (విజయక్రాంతి): సహారా ఇండియాలో డిపాజిట్లు చేసి ఏండ్లు గడుస్తున్న డబ్బులు చెల్లించడం లేదంటూ మంగళవారం బాధితులు మంచిర్యాలలోని సహారా ఇండియా(Sahara India Pariwar) కార్యాలయం ముందు ప్లకార్డ్స్ తో డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, సింగరేణి విశ్రాంత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టిన లక్షలాది రూపాయల డబ్బులను భవిష్యత్తులో తమ కూతుర్ల పెళ్లిలకు, కొడుకుల చదువులకు, చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశంతో సహారా ఇండియాలో డిపాజిట్ చేశామని, డిపాజిట్ చేసిన పాలసీలు మెచ్యూరిటీ పూర్తి అయ్యి ఏండ్లకేండ్లు గడుస్తున్న మా చెప్పులు అరిగేలా సహారా ఆఫీస్ ల చుట్టూ తిరిగినా డిపాజిట్ డబ్బులను చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మా డిపాజిట్ లను వెంటనే చెల్లించాలని, లేకుంటే కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునుడే శరణ్యమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సహారా బాధితుల సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. సహారా కార్యాలయంలోని సిబ్బందికి సహారా ఇండియా పాలసీలు మెచ్యూరిటీ పూర్తయిన ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా కృషి చేయాలని, లేనియేడల సహారా ఇండియా ఆఫీస్ ల ముందు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహారా బాధితుల సంఘం నాయకుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు దండు రాజమౌళి, జి ప్రభాకర్, ఎం కాంతయ్య, పి చంద్రకాంత్, ఎస్ భీమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.