14-08-2024 12:05:00 AM
సెన్సెక్స్ 693 పాయింట్లు, నిఫ్టీ 208 పాయింట్లు డౌన్
ముంబై, ఆగస్టు13: హిండెన్‌బర్గ్ వర్సస్ సెబీ, ఆదానీ ఉదంతంపై తదుపరి పరిణామాల పట్ల ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్తగా అమ్మకాలు జరపడంతో స్టాక్ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ తొలిదశలో గ్యాప్‌అప్‌తో మొదలైన స్టాక్ సూచీలు మధ్యాహ్న సెషన్ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 693 పాయింట్ల నష్టంతో 79,000 పాయింట్ల స్థాయిని వదులుకుని 78,956 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,200 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. చివరకు 208 పాయింట్ల నష్టంతో 24,139 పాయింట్ల వద్ద నిలిచింది. భారత్ మార్కెట్ అధిక విలువలు కూడా ఈక్విటీలను దెబ్బతీశాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే తాజా గా విడుదలైన పారిశ్రామికోత్పత్తి గణాంకా లు సైతం ఇన్వెస్టర్లను నిరాశపర్చాయని అన్నారు. జూన్ నెలలో పారిశ్రా మికోత్పత్తి వృద్ధి రేటు ఐదు నెలల కనిష్ఠస్థాయి 4.8 శాతానికి తగ్గింది.
బ్యాంకింగ్‌లో అమ్మకాల జోరు
దాదాపు అన్ని రంగాలు..ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎంఎస్‌సీఐ ఇండెక్స్ మార్పులతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్‌లోకి నిధుల ప్రవాహం నెమ్మదిగా ఉంటుందనే అంచనాలతో ఆ షేరులో భారీ అమ్మకాలు జరిగా యన్నారు. ఆసియా సూచీలు మాత్రం రికవరీ అయ్యాయి. జపాన్ నికాయ్ సూచి, సియోల్, షాంఘై, హాంగ్‌సెంగ్ సూచీలు పెరిగాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4 శాతం నష్టపోయి రూ.1,603 వద్ద నిలిచింది. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 3 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రాలు స్వల్పంగా పెరిగాయి.వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా కమోడిటీస్ ఇండెక్స్ 1.84 శాతం పడిపోయింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.73 శాతం క్షీణించగా, బ్యాంకెక్స్ 1.45 శాతం తగ్గింది. మెటల్ ఇండెక్స్ 1.37 శాతం, సర్వీసెస్ ఇం డెక్స్ 1.18 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.84 శాతం చొప్పున తగ్గా యి. కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ మా త్రం పెరిగింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం చొప్పున క్షీణించాయి.
రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.4.5 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,52,565 కోట్లు తగ్గి రూ.4,45,30,265 కోట్లకు (5.30 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. మార్కెట్ విలువ అధికంగా ఉన్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు క్రమేపీ విక్రయాలు జరపడం క్షీణతకు దారితీసిందని విశ్లేషకులు తెలిపారు. సోమవారం రూ.4,600 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం మరో రూ.2,100 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు.