calender_icon.png 7 October, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారా అథ్లెట్లకు సలాం

07-10-2025 12:00:00 AM

భారత్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మన అథ్లెట్లు సత్తా చాటారు. అంగవైకల్యం శరీరానికే కానీ ఆటకు కాదని మరోసారి నిరూపిస్తూ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గతేడాది పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో 29 పతకాలతో సత్తా చాటిన భారత పారా అథ్లెట్లు.. తాజాగా ఆదివారం ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొట్టారు. ఆరు స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు మొత్తంగా 22 పతకాలు సాధించి జాతీయ జెండాను రెపరెపలాడించారు.

ప్రపంచస్థాయి క్రీడల్లో అన్నింటా పోటీ పడుతూ తమ కంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న పారా అథ్లెట్లకు సలాం చెప్పాల్సిందే. గతేడాది కోబేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ 17 పతకాలు సాధించడమే ఇప్పటివరకు అత్యుత్తమం. న్యూఢిలీ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆ రికార్డును బద్దలుకొట్టిన మన అథ్లెట్లు కొత్త చరిత్ర లిఖించారు. టోర్నీలో బ్రెజిల్ 44 పతకాలు అగ్రస్థానంలో నిలవగా.. చైనా 52 పతకాలు, ఇరాన్  16 పతకాలు తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. 22 పతకాలు సాధించిన భారత్ పట్టికలో 10వ స్థానంలో నిలిచి తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుంది. ఈసారి భారత్‌కు వచ్చిన ఆరు స్వర్ణాల్లో మూడు జావెలిన్ త్రోలోనే రావడం విశేషం.

పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంటిల్,  ఎఫ్ 46 విభాగంలో రింకూ హుడా, ఎఫ్ 44 విభాగంలో సందీప్ సంజయ్‌లు స్వర్ణాలు దక్కించుకోగా.. మహిళల 100 మీ టి12 విభాగంలో సిమ్రన్ శర్మ, పురుషుల హైజంప్ టి47 విభాగంలో నిషాద్ కుమార్, పురుషుల హైజంప్ టి63 విభాగంలో శైలేష్ కుమార్ పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జివాంజీ డిపెండింగ్ చాంపియన్ హోదా కోల్పోయినప్పటికీ మహిళల 400 మీ టి20 విభాగంలో రజతంతో మెరిసింది. భారత స్టార్ పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో వరుసగా మూడో ఏడాది కూడా స్వర్ణంతో మెరవడం విశేషం. కొన్నేళ్లుగా పారా అథ్లెట్లు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నారు.

పారాలింపిక్స్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఆసియా పారా గేమ్స్.. ఇలా టోర్నీ ఏదైనా పతకాల వేటలో అదరగొడుతున్నారు. అయితే తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నప్పటికీ పారా అథ్లెట్లకు అందుతున్న మద్దతు మాత్రం అరకొరగానే ఉంది. ఒలింపిక్స్ పేరుతో కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ దేశానికి పతకాలు రావడం గగనమవుతున్న వేళ మన పారా అథ్లెట్లు మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు.

అందుకు ఉదాహరణే గతేడాది పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్. ఈ క్రీడల్లో అంచనాలకు మించి రాణించిన భారత పారా క్రీడాకారుల బృందం మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించి టాప్ నిలవడం విశేషం. ఒలింపిక్స్ పేరుతో కోట్లు ఖర్చు పెట్టే మన భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) పారా అథ్లెట్ల విషయంలో పక్షపాత వైఖరిని వీడితే బాగుంటుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారా అథ్లెట్లకు అండగా నిలబడి వారిని రాటు దేల్చితే రానున్న కాలంలో వీరి నుంచి మరిన్ని అద్భుత ప్రదర్శనలు రావడం ఖాయం.