07-10-2025 12:00:00 AM
ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒక రికార్డ్ అసిస్టెంట్‌ను కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టును కానీ మంజూరు చేయాలి. ఈ మధ్య కాలంలో చాలా ప్రాథమికోన్నత పాఠశాలలు.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయిన సంగతి తెలిసిందే. ప్రాథమికోన్నత పాఠశాలలు ఇలా జిల్లా పరిషత్ పాఠశాలలుగా మారడం వల్ల అందులో పనిచేస్తున్న బోధనా సిబ్బందిపై అదనపు పని భారం పడుతుంది. దీనివల్ల ఇటు బోధన అటు బోధనేతన పనులు చేయలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయులకు పని భారం తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రతి పాఠశాలకు రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్‌ను నియమించాల్సిన అవసరముంది. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలి. వీరి ప్రక్రియ పూర్తయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బోధనేతర పనిని మొత్తం వీళ్లే పరిశీలిస్తారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు టీచర్లకు పని భారం తగ్గుతుంది. ఒకవేళ ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందనకుంటే కారుణ్య నియామక ప్రక్రియ ద్వారానైనా ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
షేక్ అస్లాం షరీఫ్, హైదరాబాద్
ఏడాది యాదిలో కొత్త టీచర్లు
2024 డీఎస్సీ ద్వారా ఎంపికయిన 10, 500 మంది ఉపాద్యాయులు అక్టోబర్ 9వ తేదీతో ఒక సంవత్సరం సర్వీస్‌ను పూర్తి చేసుకోనున్నారు. నియామకమైన కొత్త టీచర్లు ఏడాది కాలంగా అనేక అంశాల్లో విన్నూత పద్ధతిలో బోధన చేయడంతో ఎంతో పరిణితి సాధించారు. 2023- డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కొరకు అనేక సార్లు ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. గతంలో డీఎస్సీపై డిమాండ్స్ లేనప్పటికీ ఉమ్మడి రాష్ర్టంలో వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీ అయ్యేవి. కానీ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత 2017, 2024లో రెండుసార్లు మాత్రమే డీఎస్సీ పరీక్ష జరిగింది. అయితే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడంలో కాలయాపనతో అభ్యర్థులు డీఎస్సీ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లి విజయం సాధించారు.
అనేక ఆందోళనలతో 2023లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అతి తక్కువ పోస్టులు మంజూరు చేయడంతో అభ్యర్థులు నిరాశ చెందారు. అప్పుడే సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. రేవంత్ సర్కార్ అదనపు పోస్టులు కలిపి మొత్తంగా 11,062 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షల నిర్వహణ, 2024 సెప్టెంబర్ 30న ఫలితాలు విడుదల, అక్టోబర్ 9వ తేదిన నియామక పత్రాలు అందుకోవడం వెనువెంటనే జరిగాయి. ఇక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం.
రావుల రామ్మోహన్ రెడ్డి, కరీంనగర్