07-10-2025 01:49:22 PM
హైదరాబాద్: క్యుములోనిబంస్ మేఘాల వల్ల మంగళవారం తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హైదరాబాద్ అంచనా వేసింది. పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కాగా, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు(Hyderabad Rains) కురుస్తున్నాయి. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లంగర్ హౌస్, రాయదుర్గం, కార్వాన్, జియాగూడ, గుడిమల్కాపూర్, తాళ్లగడ్డ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. వర్షం కురుస్తుండటంతో ఎక్కడ వాహనదారులు అక్కడ ఆగిపోయారు. రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కాగా, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి ఎండ కొడుతూనే సాయంత్రం వరకు ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది.
నగరంలో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఇది కుమరం భీమ్‌లో నమోదైంది. హైదరాబాద్ విషయానికొస్తే, సోమవారం బండ్లగూడలో నమోదైన ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అంచనా వేసిన వాతావరణ పరిస్థితుల కారణంగా, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్, ఇతర జిల్లాల్లో ఐఎండీ వర్షాల అంచనాలను దృష్టిలో ఉంచుకుని, నివాసితులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.