calender_icon.png 14 September, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయానికి మోక్షం

14-09-2025 01:10:01 AM

  1. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేములవాడ అభివృద్ధి
  2. వీటీడీఏ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయ విస్తరణ
  3. సులభ దర్శనం, మెరుగైన వసతులు
  4. ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక 
  5. రూ.111 కోట్లతో ఆలయ విస్తరణ
  6. 35.25 కోట్లతో అన్నదానసత్రం
  7. 2027 నాటికి రూ.700 కోట్లతో పనులు 

రాజన్న సిరిస్లి జిల్లాలోని వేములవాడ ఆలయంలో భక్తులకు సులభంగా స్వామివారి దర్శనం, మెరుగైన వసతులు కల్పించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) ఆధ్వర్యంలో ప్రధాన ఆలయ విస్తరణ, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. వేములవాడ మూల వాగు నుంచి ప్రధాన ఆలయం వరకు బ్రిడ్జి, రహదారి నిర్మాణం పనులు మొదలయ్యాయి.

ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అన్ని నిర్మాణాలను ఆగమ శాస్త్రానుసారంగా పనులు చేపడుతూ భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు సర్వం సిద్ధమవుతుంది. వేములవాడ అభివృద్ధి ప్రణాళిక ఏకపక్షంగా కాకుండా, విస్తృత చర్చల అనంతరం ఖరారైంది. శృంగేరి పీఠాధిపతి ఆశీర్వాదం, పండితులు, ప్రముఖులు, పట్టణ పెద్దల సూచనలు, స్థానిక ప్రజల అభిప్రాయాలు, మీడియా వర్గాల సూచనలతో తుది రూపు దాల్చింది. ఆలయ నిర్మాణ డిజైన్ల ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.

మార్గం.. సుగమం

వేములవాడలో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనున్నది. మూలవాగు నుంచి శ్రీ రాజ రాజేశ్వర ఆలయం వరకు ఇప్పుడు ఉన్న 40 ఫీట్ల రోడ్డు స్థానంలో 80 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 కోట్ల 86 లక్షలు మంజూరు చేసింది. విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, విటిడిఏ వైస్ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణలో ఇండ్లు,

స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు నష్ట పరిహారం చెక్కులు అందజేసి, కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే మూల వాగు వద్ద స్థలాలు సేకరించి ఆ పనులు వేగంగా చేపట్టేలా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. రూ.6 కోట్ల 56 లక్షలతో ప్రస్తుతం బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పాటు పట్టణ వాసుల ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి.

ఆకర్షణీయంగా మహా మండపం, గోపురాలు

మొదటి దశలోనే 111 కోట్ల రూపాయల వ్యయంతో మహా మండపం, నిత్య కల్యాణ మండపం, ధర్మ గుండం పునరుద్ధరణ, కొత్త రాజ గోపురాలు ఆకర్షణీయంగా నిర్మించేందుకు  పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యాత్రికుల సౌకర్యార్థం విశాల ప్రాకారాలు, ప్రత్యేక క్యూ లైన్లు కూడా సిద్ధమవుతున్నాయి.

రాబోయే దశల్లో గుడి చెరువు ఘాట్ అభివృద్ధి, బండ్ సుందరీకరణ, (బ్యూటిఫికేషన్), మల్టీ లెవెల్ పార్కింగ్, వాహనాల కోసం విస్తృత స్థలాలు కూడా అభివృద్ధి కానున్నాయి. అలాగే షాపింగ్ కాంప్లెక్సులు, హెల్ప్ డెస్క్, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఆలయం వద్ద రూ. 25 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించేందుకు వీలు కానున్నది.

ఒకేసారి వెయ్యిమంది భోజనం చేసేలా..

రూ. 35.25 కోట్లతో అన్న దానసత్ర భవనం నిర్మాణం జరుగుతోంది. ఒకే సారి వెయ్యి మంది భోజనం చేసే డైనింగ్ హాల్, 600 మందికి వెయిటింగ్ హాల్, లడ్డూ తయారీ కేంద్రం, ఆధునిక వంట శాలలు అందించగల సామర్థ్యం కలుగనుంది. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పాత కట్టడాల కూల్చివేత, కొత్త నిర్మాణాలకు స్థలం సిద్ధం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే భారీ యంత్రాలతో పాత గోడలు, నిర్మాణాలను తొలగించి శుభ్రపరిచే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్ట్ కింద రూ.150 కోట్ల వ్యయంతో రహదారుల విస్తరణ, 3.40 కోట్లతో భూసేకరణ, కంపౌండ్ వాల్ నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.

భీమేశ్వర ఆలయంలో

శ్రీ బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు రూ.పది కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 12 కోట్ల నిధులతో గుడి చెరువులో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. రాజన్న ప్రధాన ఆలయంలో స్వా మి వారికి నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయి. శ్రీ భీమేశ్వర ఆలయంలో రూ. 3 కోట్ల 44 లక్షలతో కల్యా ణ మండపం, హోమ, వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. 

రాజన్న కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

వేములవాడ రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడె మొక్కు. కోడెల సంరక్షణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గోశాలలో సీసీ ఫ్లోరింగ్, షెడ్లు నిర్మింపజేశారు. ఇతర పారిశుద్ధ్య పనులు నిత్యం చేయిస్తున్నారు. ఇప్పటిదాకా చిన్న సన్నకారు రైతులకు మొత్తం 2 వేల కోడెలను పంపిణీ చేయించారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పశు వైద్య సిబ్బందిని నియమించారు.

కోడెలకు నిత్యం పచ్చిగడ్డి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గోశాలలోని జీవాలకు పచ్చగడ్డి సమస్య పరిష్కారానికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చగడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించడం జరిగింది. జీవాలకు నిత్యం పచ్చగడ్డి అందుబాటులో ఉంటుంది.  

అభివృద్ధి పనులపై ప్రత్యేక పర్యవేక్షణ

వేములవాడ ఆలయ అభివృద్ధి పై మంతులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రి న్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, వీటీడీఏ వైస్ చైర్మెన్ సందీప్ కుమార్ ఝా తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప నుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ, భూసేకరణ, భద్రతా చర్యలపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నా రు. వేములవాడ పట్టణం, శ్రీ రాజరాజేశ్వర ఆలయం అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అవతరించనుంది. 

 రాజన్న సిరిసిల్ల, విజయక్రాంతి

టెంపుల్ సిటీగా వేములవాడ 

ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళిక వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నది. శృంగేరి పీఠాధిపతులు, వాస్తు పండితులు, ప్రముఖుల సలహాలు, సూచనలు మేరకు రాజన్న ఆలయాన్ని విస్తరిస్తున్నాం. భక్తులకు సులభంగా.. వేగంగా దర్శనం కల్పిస్తం. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి  నిధులు మంజూరు చేసి ప్రత్యేక దృష్టి సారిస్తునందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

 ఆది శ్రీనివాస్, విప్, వేములవాడ ఎమ్మెల్యే

ప్రణాళిక ప్రకారం పనులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటీడీఏ ఆద్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్త రణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభు త్వ లక్ష్యం ప్రకారం గడువులోగా పనులు పూర్తి చే సేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తు న్నాం. ఆలయ విస్తరణ, రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సహకరిస్తున్న వేములవాడ ప్రజలకు ధన్యవాదాలు.

సందీప్ కుమార్ ఝా, వీటీడీఏ వైస్ చైర్మైన్, కలెక్టర్