calender_icon.png 14 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి లింగాల స్వర్గం కోటగుళ్లు!

14-09-2025 01:13:11 AM

కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా.. 22 గుళ్ల సమూహం 

కాకతీయుల వారసత్వ సంపదగా కోటగుళ్లు ప్రసిద్ధి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న 22గుళ్ల సమూహం భక్తుల’కోటి లింగాల స్వర్గం’గా పేరు గడించింది. 12వ శతాబ్దంలో కాకతీయులు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో నిర్మించిన ఈ గుళ్ల సమూహం భక్తులు, పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తూ శతాబ్దాలుగా శిల్ప కళా వైభవాన్ని ప్రదర్శిస్తున్నాయి. కోటగుళ్లు శైవ మతానికి ప్రధానంగా ఉన్నప్పటికీ సమాజ ఐక్యతకు చిహ్నంగా నిలిచి, ప్రపంచ పర్యాటక సంస్థ (డబ్ల్యూటీఓ)నుంచి హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందింది.

కోటగుళ్లు అంటే ’మట్టి కోటలోని గుళ్లు’ అని అర్థం. ఈ స్థలం, గణపురం గ్రామానికి ఈశాన్య దిశలో ఉన్న మట్టికోటలో ఉండటం వల్ల ఈ పేరు రావడం ఒక చారిత్రక విశేషం. సా.శ. 1199-1260 మధ్య కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవ చక్రవర్తి, సా.శ. 1234లో ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించాడు. రామప్ప దేవాలయాన్ని పేరుపొందిన రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది.

కాకతీయులు శైవ మతాభిమానులు అయినప్పటికీ, వైష్ణవ మతానికి కేశవ భేదం చూపకుండా ఈ ఆలయాలను నిర్మించడం ప్రత్యేకత. ఈ సముదాయం చుట్టూ రాతి గోడలతో ప్రాకారం నిర్మించబడి, దాని చుట్టూ 24 ప్రాకారపు ఆలయాలు కుడి వైపు నాట్యమండపం, ఎడమ వైపు కాటేశ్వరాలయం ప్రధాన ఆలయం, గణపేశ్వరాలయం ఉన్నాయి. 

‘ట్రిపుల్ టీ’ విధానంలో..

కాకతీయ నిర్మాణ శైలికి మచ్చుతునకలుగా భావిస్తున్న కోట గుళ్లు, ’ట్రిపుల్ టీ’ (టౌన్-టెంపుల్-ట్యాంక్) విధానం లో రూపొందించబడ్డాయి. గణపురం నగరం, గణపేశ్వరాలయం, గణపసముద్రం (పెద్ద చెరువు)లతో కూడిన ఈ సముదాయం, సామంత రాజ్య కేంద్రంగా రూపొందింది.

ప్రధాన ఆలయంలో సర్పధారియై ఢమరుకాన్ని వాయిస్తున్న పరమశివుని నిలువెత్తు విగ్రహం, దీర్ఘాకృతి శివలింగం (నక్షత్రకార పానఘట్టంపై కొలువై ఉంది) ప్రధాన ఆకర్షణలు. ఆలయ గోడలపై చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కళ్యాణం వంటి శిల్పాలు అబ్బురపరుస్తాయి. 

సాంస్కృతిక కార్యక్రమాలకు మొదటి ఆస్థానంగా..

చరిత్రలో ఈ ఆలయం కేవలం పుణ్యక్షేత్రమే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా మొదటి ఆస్థానంగా ఉండేది. గణపతి దేవుడు 60 ఎకరాల మాగాణి భూమిని దానంగా ఇచ్చి, దాని ఆదాయంతో ధూపదీప నైవేద్యాలు, అంగరంగ భోగాలు నిర్వహించేవారు. 72 మంది సేవకులు,16 మంది వాయిద్యకారులతో ప్రతీరోజు నాట్య ప్రదర్శనలు, సంకీర్తనలు జరిగేవి.

దక్షిణ వైపు 60 స్తంభాలతో రంగ మంటపం ఉండేది, అక్కడ వివిధ సాంస్కృతిక, విజ్ఞాన, సంగీత, సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. అయితే, పూర్వకాలంలో గుప్త నిధుల కోసం కొందరు ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం క్షీణించిన స్థితిలో ఉన్నప్పటికీ, రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలతో పోల్చదగ్గ శిల్ప సౌందర్యాన్ని కలిగి ఉంది.

పర్యాటక ఆకర్షణగా..

ప్రస్తుతం కోట గుళ్లు పుణ్యక్షేత్రంగా, పర్యాటక ఆకర్షణగా మారింది. సోమ, శుక్రవారాల్లో గణపతి, నందీశ్వర పూజలు, అభిషేకాలు, మహా మంగళహారతి ఘనంగా జరుగుతాయి. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్ల్లో లక్షలాది భక్తులు కోటగుళ్లను సందర్శిస్తారు. ఈ దర్శనంతో కోరికలు నెరవేరతాయి’ అనే విశ్వాసంతో రాష్ట్రం, విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. 

శివ ద్వారా పాలక విగ్రహాలు ప్రత్యేకం

ఆలయ అభివృద్ధిలో భాగంగా గర్భాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తున్న క్రమంలో బయటపడిన పది అడుగుల భారీ శివ ద్వార పాలక విగ్రహాలు ఆలయానికి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాకతీయుల శిల్పకళా వైభవానికి ఈ విగ్రహాలు ప్రతీకగా నిలుస్తాయి.

తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 20 ఏళ్లుగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ, గోశాల నిర్వహణ సాగుతోంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఉత్సవాలు, మహాశివరాత్రి పర్వదిన వేడుకలు కనుల పండువగా నిర్వహిస్తారు. 

పర్యాటక పొదరిల్లుగా..

వరంగల్ నుంచి సుమారు 65 కి.మీ. దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం భద్రకాళి దేవస్థానం, ఓరుగల్లు కోట వంటి ప్రదేశాలతో కలిసి పర్యాటక పొదరిల్లుగా మారింది. చారిత్రక కర్ణాటక శాస్త్రవేత్తలు, ‘కోట గుళ్లు’ కాకతీయుల సామాజిక, మతపరమైన సహనానికి, కళారంగానికి ప్రతీక’ అని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ హెరిటేజ్ స్థలాన్ని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ శతాబ్దాల కథను చెప్పుకుంటూ, కోట గుళ్లు తెలంగాణ చరిత్రలో ఒక అమర గ్రంథంగా మిగిలి ఉంది.

 బండి సంపత్‌కుమార్, విజయ క్రాంతి, మహబూబాబాద్