14-09-2025 01:04:08 AM
విమోచనంలో జిల్లా యోధుల పాత్ర కీలకం
తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యోధుల పాత్ర గణనీయమైంది. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి వీరులగడ్డ కేంద్రంగా నిలిచింది. ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన అనభేరి ప్రభాకర్రావు లాంటి ఎందరో పోరాట యోధులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్నతల్లిగా పేరుగాంచింది.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటే నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ కరువైంది. నిజాం అకృత్యాలతో సహనం కోల్పోయిన ఇక్కడి ప్రజలు సాయుధ పోరు ప్రారంభించారు.
హైద రాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పిలుపుతో ప్రజలు ప్రాణాలను లెక్క చేయకుండా నిజాం సర్కారును ఎదిరించారు. భారత యూనియన్ ఎట్టకేలకు నిజాం మెడలు వంచడంతో 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి విముక్తి లభించింది.
ఉద్యమానికి ఊపిరి.. ఆంధ్ర మహాసభ
1935 సెప్టెంబర్లో సిరిసిల్లలో జరిగిన ఆంధ్రమ హాసభ ఉద్యమానికి ఊపిరిపోసింది. మహాసభ తీర్మా నాల అనంతరం సంస్థానంలోని భూస్వాములు, పెత్తం దార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యాయి. 1944లో భువ నగిరిలో జరిగిన సభలో రావి నారాయణ రెడ్డి తో పాటు కరీంనగర్ కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి వంటి ముఖ్యనాయకులు తెలంగాణ సా యుధ పోరాటానికి పిలుపునిచ్చారు.
వీరి పిలుపుతో జిల్లాలో నిజాం వ్యతిరేక పోరాటాలు, రైతాంగ పోరాటాలు ఊపందుకున్నాయి. -అనభేరి ప్రభాకర్‌రావు గ్రామీణులను చైతన్యం చేయడంతోపాటు నిజాం రికార్డు లను ధ్వంసం చేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
అనభేరిపై నిర్బంధం పెరగడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. 1948 మార్చి 14న మహ్మదాపూర్- మందాపురంలో అసభేరి దళం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు వీరమరణం పొందారు.
పోరాటాలు నేర్పిన గడ్డ ..‘గాలిపెల్లి’
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామం తెలంగాణకు ఉగ్గు పాలు పట్టి పోరాటాలు నేర్పిన గడ్డ. నిజాం పోలీసులతో భీకర పోరు సల్పిన ప్రజారక్షణ దళం సభ్యులు బద్దం బాల్‌రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తోపాటు మల్లారెడ్డి,
సింగిరెడ్డి అంజిరెడ్డిలకు జన్మనిచ్చిన గ్రామం గాలిపల్లి, 1947 సెప్టెంబర్ నెల గాలిపల్లి చరిత్రలో మరపురాని ఘట్టం. పోలీసులను ఎదురించిన ప్రజలు వారిని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. మరుసటి రోజు 300 మంది నిజాం పోలీసులు గ్రామంపై మూకుమ్మడి దాడి చేయడంతో 18మంది అసువులుబాసారు.
గెరిల్లాల శిక్షణ కేంద్రం.. ‘మానాల’
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సిరిసిల్ల డివిజన్ సరిహద్దులోని మానాల గ్రామం గెరిల్లాల శిక్షణ కేంద్రంగా నిలిచింది. సిరిసిల్లకు చెందిన అమృతలాల్ శుక్లా, బద్దం ఎల్లారెడ్డిల నాయకత్వంలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఆర్మూర్, రుద్రంగి తాలూకలకు చెందిన కార్యకర్తలకు శిక్ష కేంద్రంగా ఉండేది. కమ్యూనిస్టు గెరిల్లాలకు ఆ గ్రామ భూస్వామి రాజిరెడ్డి భోజనాలు సరఫరా చేసేవారు.
మానాలలో గెరిల్లాలు శిక్షణ పొందుతుండగా వంద మంది నిజాం సర్కారు పోలీసులు నిర్బంధించి రుద్రంగి క్యాంపునకు గెరిల్లాలను తరలించారు. ఆ తరువాత నీలం కిష్టయ్య, ముదాం ఎల్లయ్య, సిలివేరు ఎల్లయ్య, లకావత్ కిషన్లను మానాల అడ వుల్లోకి తీసుకువెళ్లి వారి చేతనే కట్టెలు కొట్టించి, చితి పేర్చి తుపాకులతో కాల్చి దహనం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగిస్తూ కమ్యూనిస్టు గెరిల్లాలు బార్డర్ క్యాం పులను నెలకొల్పారు.
నిమ్మపల్లి, మానాల అడవుల్లో నిజాం సర్కారు పోలీసుల కన్నుగప్పి శిక్షణ పొందేవారు. స రిహద్దు ప్రాంతాల్లోని చాందా, నాగ్‌పూర్, సిరివంచ ప్రాంతాల్లోని కార్యకర్తలకు ప్రసాద్ అనే కమ్యూనిస్టు నాయకుడు శిక్షణ ఇచ్చారు. ప్రసాద్ నేతృత్వంలోనే అణభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, కట్టెపల్లి మురళీధర్రావు, కాలువ నారాయణరెడ్డి, నం భయ్య, వెంకట్రెడ్డి, పాపయ్య, మల్లారెడ్డి, చొక్కారెడ్డి లాంటి వారెందరో బార్డర్ క్యాంపులో శిక్షణ పొందిన వారే.
గాంధీ మార్గం
ఒకపక్క సాయుధ పోరాటం జరుగుతుండగా మరోవైపు అహింసావాదులు జిల్లాలో శాంతియుత ఆందోళనలు కొనసాగించారు. రజాకార్ల దురాగతాలు, ప్రభుత్వ దమన కాండకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దీంతో 1947 ఆగస్టు 9న కరీంనగర్ మండలం ఇరు కుల్ల గ్రామంలో మొదటి సత్యాగ్రహం జరిగింది. సత్యాగ్రహం చేస్తున్న జువ్వాడి సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.
1947 సెప్టెంబర్ 2న బెజ్జంకిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. 1948లో మంథనికి చెందిన రఘునాథ్ కాచే ఆధ్వర్యంలో జె.హన్మంతరావు, రామేశ్వరరావు, మురళీధర్లు కరీంనగర్లో సత్యా గ్రహం చేసి అరెస్టయ్యారు.
బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బోయినపల్లి వెంకటరామారావు చేపట్టిన శాసనోల్లంఘనలో భాగంగా కార్యకర్తలు జెండాలు ఎగురవేశారు. ఇక్కడ ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం హుస్నాబాద్, హుజూరా బాద్, జగిత్యాల ప్రాంతాలకు విస్తరించింది. అయితే, వెంకట రామారావు ఇంటిని రజకారుల సైన్యం పూర్తిగా కూల్చివేసింది.
బల్మూరి విజయ సింహ రావు, కరీంనగర్