22-05-2025 05:07:13 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): హెచ్‌టీ విద్యుత్ సర్వీసుల మంజూరు కోసం సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టినట్లు ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్ సర్కిల్ ఎస్.ఈ జే.నరేష్(NPDCL Circle S.E. J. Naresh) తెలిపారు. వినియోగదారులుకు హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీ ఆపై ఓల్టేజీ సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. నూతన విద్యుత్ సర్వీసుల మంజూరు, సరళీకృతం, పారదర్శకంగా నిర్వహించడానికి మానిటరింగ్ సెల్ సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీసులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 11 కేవీ దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏడీఈ కమర్షియల్ అధికారి పర్యవేక్షిస్తారని, అలాగే 33 కేవి ఆపైన దరఖాస్తులను ఏడిఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు.
నూతన సర్వీసుల కోసం వినియోగదారులు టిజిఎన్పిడిసిఎల్ పోర్టల్ లో అవసరమైన పత్రాలతో నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (యుఐడి) కేటాయిస్తామని చెప్పారు. సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత నిత్యం సర్వీసు కేటాయింపు అంశం పరిశీలించే విధంగా సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లోని ఏడిఈ కంప్యూటర్ డాష్ బోర్డు మానిటరింగ్ చేస్తుందన్నారు. దరఖాస్తుల పరిశీలన, సర్వీసుల విడుదల, ఇతర కారణాలను ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అలాగే కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఎస్ఈ వివరించారు.