calender_icon.png 1 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పది’లో సంగారెడ్డిది రెండో స్థానం

01-05-2025 12:00:00 AM

  1. 99.09 శాతం ఉత్తీర్ణత

మెదక్‌లో 96.87 శాతంతో 12వ స్థానం

సిద్దిపేటలో 91.79 శాతంతో 25వ స్థానం

సంగారెడ్డి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలను రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా ఫలితాలను పరిశీలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంచి ఫలితాలను సాధించారు.

ఈసారి సిద్దిపేట జిల్లా తక్కువ శాతం నమోదు చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా 2వ స్థానంలో నిలువగా మెదక్ జిల్లా 12వ స్థానం, సిద్దిపేట జిల్లా 25వ స్థానం పొందాయి. పదవ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. 

సంగారెడ్డి జిల్లాలో 99.09 శాతం...

సంగారెడ్డి జిల్లాలో 22,374 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 22,170 మంది ఉత్తీర్ణత సాధించి 99.09 శాతం సాధించింది. ఇందులో 11,663 మంది బాలురులకు గాను 11,538 మంది ఉత్తీర్ణులవగా 98.93 శాతం సాధించగా, 10,711 మంది బాలికలకు గాను 10,632 మంది ఉత్తీర్ణత సాధించి 99.26 శాతం సాధించి మొదటి వరుసలో ఉన్నారు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా 2వ స్థానాన్ని పొందింది. 

మెదక్ జిల్లాలో 96.87 శాతం...

మెదక్ జిల్లాలో ఈసారి గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. గత సంవత్సరం 18వ స్థానంలో ఉండగా ఈసారి 12వ స్థానం సాధించింది. జిల్లాలో 10,370 మంది పరీక్షలు రాయగా 10,045 విద్యార్థులు ఉత్తీర్ణులవగా 96.87 శాతం సాధించారు. ఇందులో 4,994 మంది బాలురులకు గాను 4,791 ఉత్తీర్ణులవగా 95 శాతం సాధించారు. కాగా 5,376 మంది బాలికలకు గాను 5,254 మంది ఉత్తీర్ణులవగా 97.73 శాతంతో ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా రాష్ర్ట వ్యాప్తంగా మెదక్ జిల్లా 12వ స్థానం సాధించింది.

సిద్దిపేటలో 91.79 శాతం...

ఈసారి సిద్దిపేటలో పదవ ఫలితాలు వెనుకబడి పోయాయి. రాష్ర్ట వ్యాప్తంగా 25వ స్థానానికి పడిపోయింది. ఈ జిల్లా నుండి 14,114 మంది పరీక్ష రాయగా 12,955 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో 91.79 శాతంతో రాష్ర్ట వ్యాప్తంగా 25వ స్థానానికి పడిపోయింది. ఇందులో 7.117 మంది బాలురకు గాను 6,434 మంది ఉత్తీర్ణులై 90.40 శాతం పొందారు. అలాగే 6,997 మంది బాలికలకు గాను 6,521 మంది ఉత్తీర్ణులై 93.20 శాతం పొందారు. మొత్తంగా జిల్లాలో 91.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.

సర్కారు బడుల్లో వంద శాతం నమోదు

కోహీర్, ఏప్రిల్ 30: పదో తరగతి పరీక్షల్లో కోహీర్ మండలంలో 11 పాఠశాలల్లో 8 పాఠశాలలు  వందశాతం ఉత్తీర్ణత సాధించి మంచి రికార్డు సాధించాయి. మొత్తం 858 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 836 విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలో జెడ్పీ హె ఎస్ గురుజువాడ, జెడ్పీ హె ఎస్ దిగ్వాల్, జెడ్పీ హె ఎస్ కవేలీ, జెడ్పీ హె ఎస్ గొడిగార్పల్లి, జెడ్పీ హె ఎస్ పీచెర్యాగడి, జిఎంఆర్ దిగ్వాల్, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల కోహీర్, టిఎస్‌ఆర్‌ఈఎస్ దిగ్వాల్ పాఠశాలలు ఉన్నాయి. దిగ్వాల్ జిఎంఆర్ పాఠశాల విద్యార్థి సిరిపురం అఖిల 580 మార్కులతో ప్రథమ, అదే పాఠశాల విద్యార్థి రుమాని బేగం 579 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచి తమ సత్తా చాటారు.