11-11-2025 12:01:33 AM
-ప్రత్యేక అధికారుల పాలనతో పనులపై పట్టింపు కరువు.
-పంచాయతీలకు నిధులులేక అస్తవ్యస్తంగా మారిన పల్లెలు
-వీధులలో పేరుకుపోయిన చెత్తాచెదారం
-సమస్యలు తీర్చాలంటున్న గ్రామస్థులు
కోదాడ నవంబర్ 10: కోదాడ నియో జకవర్గం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా రోడ్లపైనే బురదనీరు పారుతోంది. దీంతో దోమల బెడద పెరిగి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వీధి దీపాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో బల్బులు వేయించే పరిస్థితి లేక చీకట్లోనే మగ్గాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసిపోయింది.
అప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే అప్పటి నుంచి గ్రామాల్లో పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సమస్యలు తిష్ట వేశాయి. దీనికి తోడు నిధుల లేమితో అభివృద్ధి పనులు కొనసాగక ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు.
పేరుకుపోతున్న సమస్యలు..
కోదాడ నియోజకవర్గం లోని ఆరు మండలాలలో గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. అనంతగిరి మండల కేంద్రంతోపాటు వాయిల సింగారం, అజ్మీర తండా, పాలవరం, వెంకట్రాంపురం, ఖానాపురం తో పాటు పలు గ్రామాలలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాలవలలో బురద పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతోపాటు అనేక సమస్యలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడిగూడెం మండలంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
పారిశుద్ధ్య సమస్యతో పాటు, వీధి దీపాలు వెలుగడం లేదు. ప్రత్యేక అధికారులు కూడా నిధుల లేమితో మొక్కబడిగా విధులను నిర్వహిస్తున్నారు. మునగాల, చిలుకూరు, కోదాడ రూరల్, మోతే ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోదాడ పట్టణంలో ఇటీవల డ్రైనేజీ కాల్వలో పూడికతీత కార్యక్రమం చేపట్టారు కానీ అవి పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కోదాడ పట్టణం నుండి అనంతగిరి రహదారిలో గల ఐటిఐ కాలేజీ వరకు ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు ఒకటి కూడా వెలగని పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
చెరువును తలపిస్తున్న రహదారులు..
అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కురిసిన వరదపునీరు రహదారుల పైకి వచ్చి గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక్కరోజు కురిసిన వర్షానికి రహదారి మొత్తం చెరువును తలపిస్తుంది.దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు
వాతావరణంలో మార్పులు... వ్యాధులు ప్రబలే అవకాశం
వాతావరణంలో మార్పులు.. ఓ వైపున వర్షాలు.. భారీగా ప్రజలు విషజ్వరాల బారిన పడే అవకాశం ఉంది. గత ఏడాది దగ్గు, జలుబు, తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు, వీడని జ్వరం తదితర లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెట్టారు.. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు.. అందరినీ చుట్టుముట్టేస్తోంది. గ్రామాలలో పరిస్థితి చూస్తే భయానకంగా ఉండడంతో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు కురూస్తున్న వర్షాలతో రోగాల బారిన పడతాము అని ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీ కార్యదర్శులకు తప్పని తిప్పలు
నియోజకవర్గం పలు గ్రామ పంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా మారడంతో గ్రామ కార్యదర్శులకు తిప్పలు తప్పడం లేదు. అయితే గతంలో కార్యదర్శులు చేయించిన పనులకు సంబంధించిన డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కార్యదర్శులు అప్పు చేసి పనులను చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వీధిలైట్లు, బోర్ మోటార్ లు కాలిపోవడం, ట్రాక్టర్ల మరమ్మతులు, డీజిల్ ఖర్చులు అన్నీటికీ మేమే పెట్టాల్సి వస్తుంది. డబ్బులు రానప్పుడు ఎలా పనులు చేసేది అని కార్యదర్శుల మధ్యే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రత్యేక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోతూ, సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పలు గ్రామాలలో ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామాలలో పారిశుధ్యంపై దృష్టి పెట్టి సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
పారిశుధ్యంపై పట్టింపు లేదు
శీతలతండ గ్రామంలో మురుగు కాల్వలు తీయట్లేదు, వాసన వస్తుంది. వీధి దీపాలు లేవు. రోడ్లపై చెత్తా చెదారం పేరుకపోయింది. ఇక అన్ని గ్రామాలలో పరిస్థితి ఇలాగే ఉంది. మొత్తానికి గ్రామాలలో పారిశుధ్యం గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఎన్నికలు పెడితే కొత్త సర్పంచ్ లు అయినా ఈ సమస్యలు తీరుస్తారు కావున ఎన్నికలు పెడితే మంచిది.
నూనావత్ కవిత, శీతలతండ వాసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఇసాక్ హుస్సేన్, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, కోదాడ