సంజూ నీకర్థమవుతుందా ?
- ఇలా ఆడితే చోటు గల్లంతే
- వైఫల్యాల బాటలో వికెట్ కీపర్
- రేసులో ఇషాన్ కిషన్, వైభవ్
- ఈ సిరీస్ చివరి ఛాన్స్
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ప్లేస్ ప్రమాదంలో పడింది. వరుస వైఫల్యాలతో తుది జట్టులో చోటు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అవకాశాలు రాని సంజూ ఇటీవల వరల్డ్‌కప్‌లో రాణించి టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే విదేశీ పిచ్‌లపై వరుసగా తేలిపోతున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించకుంటే మాత్రం సంజూకు చోటు కష్టమే.
మాంచెస్టర్, జూలై 2 : భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమే దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ఎప్పటికప్పుడు నిలకడగా రాణిస్తేనే జట్టులో ఉంటారు. ఒకటిరెండు మ్యాచ్ లలో ఫెయిలైతే మాత్రం అతని ప్లేస్‌పై చర్చ మొదలువుతుంది. ఎందుకంటే ప్రస్తుతం భారత క్రికెట్‌లో ప్రతీ ప్లేస్‌కూ కనీసం ఐదుగురు పోటీలో ఉంటున్నారు. సెలక్టర్లకు ఆప్షన్స్ ఎక్కువగా ఉండడంతో వరుసగా ఫెయిలయ్యే ప్లేయర్‌ను తప్పించక తప్పడం లేదు.
అందుకే ప్రతీ మ్యాచ్‌లో స్థాయికి తగినట్టు ఆడితేనే కొనసాగుతారు. లేకుంటే వేటు తప్పదు. పైగా హెడ్ కోచ్ గంభీర్ వచ్చిన తర్వాత ఎలాంటి ఆటగాడినైనా తప్పించేందుకు వెనుకాడడం లేదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ వైఫల్యాల బాటలో ఉన్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో ఫెయిలైన సంజూ తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి టీ ట్వంటీలోనూ నిరాశపరిచాడు. దీంతో సంజూ శాంసన్ ప్లేస్‌పై చర్చ మొదలైంది.
విదేశీ పిచ్‌లపై వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ భారత తుది జట్టులో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న శాంసన్, ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన గత 10 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు చేసినా మిగిలిన ఇన్నింగ్స్‌లలో ఏకంగా 5 సార్లు డకౌట్ కావడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 2, 5, 1 పరుగులు మాత్రమే చేయడంతో సంజూ టెక్నిక్ప్ విమర్శలు వస్తున్నాయి.
భారత పిచ్‌లపై చెలరేగి ఆడే సంజూ, విదేశాల్లో మాత్రం వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవుతున్నాడు. ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడన్న కారణంతోనే అతన్ని కొనసాగిస్తున్నారన్నది సుస్పష్టం. వరల్డ్‌కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సీనియర్ ఆటగాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూనే ఉంటామంటూ శ్రేయాస్ కూడా ఇటీవల చెప్పాడు. అయితే వరుస వైఫల్యాల తర్వాత ఎక్కువ అవకాశాలు ఇచ్చినా గంభీర్ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అందులోనూ జట్టులో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ రూపంలో మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఇషాన్ సొంతం. అటు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. సూర్యవంశీ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఓపెనింగ్ సమస్యను అధిగమించడానికి సంజూ స్థానంలో సూర్యవంశీని తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.
సీనియర్ల ఓపెనింగ్ కాంబినేషన్ మార్చకూడదనే ఉద్దేశంతోనే సంజూను కొనసాగిస్తున్నప్పటకీ మరో రెండు మ్యాచ్‌లు ఫెయిలైతే మాత్రం సంజూ బెంచ్ కే పరిమితం కాక తప్పదు. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్లు ఇచ్చే మెరుపు ఆరంభాలపైనే భారీస్కోర్లు, ఆపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఏదేమైనా టీమిండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే సంజూ శాంసన్ తదుపరి లభించే అవకాశాల్లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.






