15-05-2025 09:29:47 AM
పుష్కరాలను వేకువ జామున ప్రారంభించిన శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలను శ్రీశ్రీ శ్రీ మాధవానంద సరస్వతి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనంతరం త్రివేణి సంఘంలో స్నానం ఆచరించి పుష్కరునికి పూజలు చేశారు. శ్లో॥ ప్రణీత వరదా వైణ్య గౌతమీచ సరస్వతి॥ సద్యః పంచ వహం త్యత్ర ప్రయాగా త్కోటి శోధికం ॥ కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారు మ్రోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి.
గురువారం వేకువ జామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ సాంప్రాదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈ సారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.గణపతి పూజతో గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. గోదావరి పుష్కరాల సమయంలో (వీఐపీ ఘాట్) సరస్వతి ఘాట్ లో సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆయన సతీమణీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, మంత్రి తల్లి దుద్దిల్ల జయమ్మ, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరయ్యారు. విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేసిన తరువాత సరస్వతి నది పుష్కర మహోత్సవ వేడుకలకు అంకురార్పరణ చేశారు.పీఠాధిపతిచే.అత్యంత అరుదైన సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుష్కర స్నానలను కూడా నిర్వహించారు.
శ్రీ గురుమదానానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. అనంతరం శ్రీ కాళేశ్వర, మక్తీశ్వర స్వామి, శ్రీ శుభానంద దేవి, సరస్వతి మాత ఆలయాలను ప్రముఖులు సందర్శించుకున్నార.ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం గత కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి.పుష్కర స్నానాలు ఆచరించి చదువుల తల్లి సరస్వతి మాతా అశీస్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు కాలేశ్వరం దేవస్థానం అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.