12-12-2025 07:45:14 PM
తెర వెనుక రాజకీయాలైనా ప్రజానిశ్చయం దృఢం
హన్మకొండ,(విజయక్రాంతి): కమలాపూర్ మండలంలో తాజా గ్రామపంచాయతీ ఎన్నికల్లో కమలాపూర్ సర్పంచ్ గా పబ్బు సతీష్ గెలుపొందారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నాయకుల తెర వెనుక ఎన్ని కుయుక్తులు చేసిన కమలాపూర్ లో ధర్మమే గెలిచిందన్నారు. డబ్బు, మద్యం వంటి అనేక ప్రలోభాలు ఉన్నప్పటికీ ప్రజలు తనకు ఇచ్చిన తీర్పు నిజాయితీ, సేవా భావానికి నిదర్శనమని తెలిపారు.
తమ పార్టీకి చెందిన కొంత మంది నేతలే కాంగ్రెస్,బీఆర్‌ఎస్ పార్టీలతో కలిసి తెర వెనుక రాజకీయాలు చేసినా రాష్ట్రంలో రెండో స్థానంలో 2,150 ఓట్ల అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.కమలాపూర్ ప్రజలు చైతన్యవంతులని, ఈటల రాజేందర్‌ను పతనం చేయడానికి జరుగుతున్న కుట్రలను గుర్తించి తగిన తీర్పు నిచ్చారని చెప్పారు. సేవ చేసే వారికే గెలుపు, డబ్బుకు కాదు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంచితనాన్ని ఎంచుకున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకున్నా తమ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు కూడా కుట్రలకు పాల్పడటం విచారకరమని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇక్కడ ధర్మమే గెలిచిందని స్పష్టం చేశారు. అభివృద్ధిని పక్కనబెట్టి, బీఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేకించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గెలిచిన సర్పంచులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించేందుకు ప్రయత్నించడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే ఏ పని చేయలేదుఅని విమర్శించారు. ఏది ఏమైనా, కమలాపూర్ ప్రజలు డబ్బు రాజకీయాలకు కాదని, మంచి సేవ చేసే నాయకత్వానికే మద్దతునిచ్చారని అన్నారు.