హార్టికల్చర్ వర్సిటీని కాపాడండి
వ్యవసాయ వర్సిటీలో హార్టికల్చర్ కోర్సు వద్దంటూ విద్యార్థుల ఆందోళన
ములుగులో యూనివర్సిటీ గేటు మూసివేసి బైఠాయింపు
27న కౌన్సెలింగ్ నిలిపివేయాలని డిమాండ్
గజ్వేల్, ఆగస్టు 25: హార్టికల్చర్ విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పీజీ, పీహెచ్డీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సును ఏర్పాటు చేయొద్దంటూ ములుగులోని హార్టికల్చర్ వర్సిటీ ప్రధాన గేటును మూసివేసి గేటు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.
’హార్టికల్చర్ కోర్సులు.. హార్టికల్చర్ వర్సిటీలోనే కొనసాగాలి’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ హోదాను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 27న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న హార్టికల్చర్ కోర్సు కౌన్సెలింగ్ను తక్షణమే నిలిపివేయాలని కోరారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రఘుపతి, ఎమ్మార్వో రవీందర్రెడ్డి అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
20 ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయరా?
హార్టికల్చర్ విభాగంలో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న హెచ్‌ఏ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యపై వ్యవసాయ మంత్రిని పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా.. మరోవైపు వ్యవసాయ వర్సిటీలో హార్టికల్చర్ కోర్సును ఏర్పాటు చేయడం సరికాదన్నారు. హార్టికల్చర్ విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్సిటీ హోదాను కాపాడేలా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.






