calender_icon.png 11 September, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ అధికారాలకు కత్తెర!

09-08-2024 12:00:00 AM

వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చేందుకు కేంద్రం రూపొందించిన సవరణ బిల్లు ఇప్పుడు మరో వివాదానికి దారితీసేలా ఉంది. గురువారం లోక్‌సభలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టడంతోనే వివాదం మొదలైంది. నిజానికి ఈ సవరణ బిల్లు తేవాలని కేంద్రం చాలాకాలంగా అనుకుంటున్నది.  దీనిపై విపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఓ మెట్టు దిగిన ప్రభుత్వం బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపడానికి అంగీకరించింది. బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభేదాలకు దారితీస్తుందని చర్చ సందర్భంగా  కాంగ్రెస్ మండిపడింది. ముస్లింల హక్కులను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీన్ని తాము అంగీకరించేది లేదంటూ విపక్ష సభ్యులంతా ముక్తకంఠంతో భగ్గుమన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25 సూత్రాలను ఈ బిల్లు ఉల్లంఘిస్తున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజిస్తున్నదని, ముస్లిలకు కేంద్రం శత్రువని చెప్పేందుకు ఈ బిల్లే సాక్ష్యమంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, విపక్షాల ఆరోపణలను రిజిజు తోసి పుచ్చారు. సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని, బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామని చెప్పారు. దీనివల్ల మతపరమైన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు.

ఇతరుల హక్కులను హరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఇప్పటి వరకు హక్కులు పొందని వారికి దీంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. వక్ఫ్ బోర్డులను మాఫియా ఆక్రమించినట్లు చాలామంది ఎంపీలు ఫిర్యాదు చేశారన్నారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత తేవడానికే ఈ సవరణలు తెస్తున్నామని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో బోర్డుల అధికారాలకు కత్తెర వేయాలని అనుకుంటున్నదని ముస్లిం సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోస్తున్నాయి. ఇదే వివాదానికి అసలు కారణం.

ఇంతకీ వక్ఫ్ చట్టం ఏమిటి? కేంద్రం దీనికి తేవాలనుకుంటున్న సవరణలు ఏమిటో చూద్దాం. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. తర్వాత పలుమార్లు చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగా 1995లో వక్ఫ్ చట్టాన్ని సవరించిన ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలు కల్పించారు. ఈ బోర్డ్టుల నిర్ణయాలను ఏ కోర్టుల్లోను సవాలు చేయడానికి వీల్లేదు.

ప్రస్తుతం దేశంలో 30 దాకా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి అధీనంలో దాదాపు రూ.1.2 లక్షల కోట్ల విలువైన 9 లక్షల ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. రైల్వేలు, రక్షణశాఖ తర్వాత ఎక్కువ భూములున్నది ఈ బోర్డులకే. దీంతో ఇవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. తమిళనాడులో ఓ గ్రామం మొత్తం తమదేనని అక్కడి వక్ఫ్ బోర్డు వాదించడం దీనికి పరాకాష్ఠ. ఇప్పుడు ఈ చట్టంలో కీలక మార్పులు తేవాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు వీటిలో ముస్లిం, ముస్లిమేతర మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని బిల్లులో ప్రతిపాదించారు. అన్ని బోర్డుల్లోను ఇద్దరు మహిళలను నియమిస్తారు. 

ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కలెక్టర్లకు అధికారాలు కల్పించాలని ప్రతిపాదించారు. ఇంతకు ముందు ఈ అధికారాలు వక్ఫ్ ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉండేవి. అలాగే బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోహ్రాలు, ఆగాఖాన్‌లకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ప్రతిపాదించారు. అంతేకాదు, ఎవరై నా ఒక వ్యక్తి వక్ఫ్‌కు ఆస్తులను దానం ఇవ్వాలని భావిస్తే మౌఖిక ఒప్పందం కాకుండా ఆ విషయాన్ని వక్ఫ్‌నామా ద్వారా తెలియజేయాలని కూడా ప్రతిపాదించారు. అంతేకాదు, వక్ఫ్ వ్యవహారాలపైనైనా ఆడిట్‌కు ఆదేశించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టడానికి బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెర పడడం ఖాయం.