calender_icon.png 11 September, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయనిమచ్చగా మహావిషాదం

09-08-2024 12:00:00 AM

నేడు నాగసాకి దినం :

నేటికి 79 ఏండ్ల క్రితం జపాన్‌కు చెందిన హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా అణుబాంబుల విధ్వంసం జరిగింది. లక్షలమంది ప్రజల ప్రాణాలతో పాటు అపార ఆస్తినష్టమూ సంభవించింది. ఒక మహా విషాదకర ఘటనగా చరిత్ర లో ఇది రక్తాక్షరాలతో లిఖితమైంది. 1945 ఆగస్టు 6న హిరోషి మా నగరంపై ‘టిటిల్ బాయ్’ బాంబు, మూడు రోజుల తర్వాత 9న నాగసాకి నగరంపై ‘ఫ్యాట్ మ్యాన్’ బాంబు విస్పొటనాల్లో అపార ఆస్తి ప్రాణ నష్టాలు జరిగాయి. తర్వాత అదే నెల 14న జపాన్ లొంగి పోవడంతో ‘రెండవ ప్రపంచ యుద్ధం’ ఆగిపోయింది.

హిరోషిమాపై యురేనియం అణు విస్పొటనంలో దాదాపు 1.66 లక్షల ప్రజలు మరణించగా, నాగసాకిపై ప్లుటోనియం అణుబాంబు విధ్వంసంలో 80,000ల వరకూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకర ఘటనలుగా నిలిచి పోయాయి. ఈ రెండు బాంబు విస్పొటనాల్లో దాదాపు 2.46 లక్షల మంది పౌరు లు చనిపోవడంతోపాటు లక్షలాదిమంది దీర్ఘకాలం పాటు అనారోగ్యాల బారిన పడ్డారు. ఆగస్టు 9ని ‘నాగసాకి దినం’గా ప్రపంచం పాటిస్తున్నది. 

దక్షిణ జపాన్‌లోని ప్రధాన ఓడరేవుగా పేరు గాంచిన నాగసాకి నగరం మందుగుండు సామాగ్రి, నావలు, మిలటరీ ఉపకరణాలు, ఇతర యుద్ధ సామాగ్రిని తయారుచేసే పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందింది. నాగసాకి నగర జనాభాలో 90 శాతం జనులు పరిశ్రమల్లో పని చేసే శ్రామిక వర్గాలకు చెందినవారే. సుమారు 2.63 లక్షల జనాభా కలిగిన నాగసాకి నగరంలో బాంబు పేలిన ఫలితంగా కనీసం 80,000 మంది శవాల దిబ్బలుగా మారగా, అనేకులు తీవ్రంగా గాయపడ్డారు. కేవలం 10 శాతం జనాభా మాత్రమే బాం బు ప్రభావానికి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు.

అణు విస్పొటనం తర్వాత ఏర్పడిన రేడియేషన్, విషవాయువుల ప్రభావంతో ఈ నగరాలకు చెందిన జపనీయులు దీర్ఘకాలం పాటు తీవ్ర మానసిక వేదనలు, వర్ణనాతీత బాధలను అనుభవించారు. వీటి మధ్య ప్రజల జీవనం అత్యంత దుర్భరం. అణుశక్తిని ఇలా విధ్వంసానికి కాకుండా మానవాళి శాంతి సంక్షేమాలకు వినియోగించాలనే ప్రచారాలను ఆయా దేశాలలో మరింతగా పెంచాల్సి ఉంది. అణుబాంబుల వినియోగానికి నిషేధం విధించాలని, ప్రయోగించిన దేశాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని ఉద్యమించాలి కూడా. అప్పుడే విశ్వశాంతి కపోతం స్వేచ్ఛగా ఎగుర గలుగుతుంది.

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి