19-08-2025 06:44:16 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించడంలో సర్వేయర్లదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి భూ కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించిందని, ఈ దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, దీనిలో సర్వేయర్ల పాత్ర కీలకమైందన్నారు.
ఉమ్మడి రాష్ట్రం(1971)లో భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఇనాం, సీలింగ్ చట్టం ప్రవేశపెట్టి ఒకే సర్వే నెంబర్ లో పెద్ద మొత్తంలో భూ విస్తీర్ణం కలిగిన భూస్వాముల నుంచి 10 ఎకరాలు సీలింగ్ చట్టం క్రింద తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. టేనేంట్ యాక్ట్ కింద భూస్వాముల నుంచి లీజుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలుదారుకు హక్కు కల్పించి సీలింగ్ నుంచి పట్టా ఇవ్వడం జరిగిందన్నారు. ఒకే సర్వే నెంబర్లు పట్టా, సీలింగ్, కాంప్లికేషన్ రకాల భూములను గుర్తించి రికార్డుల ప్రకారం చర్యలు తీసుకునేవారని, 1973-74 నుంచి రెవెన్యూ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత 100 ఎకరాలలో 10 ఎకరాలు సీలింగ్ పట్టా చేయడం జరిగిందన్నారు.
సర్వేయర్లు దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, సీలింగ్ భూమిని గుర్తించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ప్రస్తుతం వచ్చే దరఖాస్తులను రిజిస్ట్రేషన్, మార్పులు, భూధార్ గుర్తింపు, ఇతర ఆధారాలను పరిశీలించి సీలింగ్, పట్టా, 38-ఈ, ప్రభుత్వ భూములను గుర్తించాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో సర్వేయర్ల పాత్ర కీలకమైనదని తెలిపారు. పట్టాదారులు తమ భూమి అభివృద్ధి సమయంలో రోడ్లకు కొంత భూమిని కేటాయించాలని, ఈ విషయంపై పట్టాదారులకు వివరించాలని, దరఖాస్తు సమయంలో వివరాలను పూర్తిగా పరిశీలించాలని తెలిపారు. మొదటి విడతలో ఎంపికైన 162 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లకు శిక్షణ అందించి, 2వ విడతలో 169 మందికి శిక్షణ అందించడం జరుగుతుందని, సర్వేయర్లు శిక్షణలో చట్టంలోని పూర్తి వివరాలు తెలుసుకోవాలని, తమ విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, అసలైన పట్టాదారులు, ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు.