calender_icon.png 6 October, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

06-10-2025 04:20:03 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజా సేవా దృక్పథంతో ఆమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో అమీర్‌పేట ఆసియన్ సత్యం దగ్గర హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్తదానం, వైద్య సలహాలు వంటి సేవలు అందించబడ్డాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని సాయికిరణ్ యాదవ్ కేక్ కట్ చేసి తన తండ్రి శ్రీనివాస్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవ చేయడం ద్వారా సమాజం ఎదుగుతుందని, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడడం అత్యున్నత సేవ అని సాయికిరణ్ యాదవ్ పేర్కొన్నారు.

తలసాని కుటుంబం ప్రజా సేవ పట్ల చూపుతున్న అంకితభావం అందరికీ ఆదర్శమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వాహకురాలు శేషుకుమారి మాట్లాడుతూ.. “తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజల కోసం ఎల్లప్పుడూ కష్టపడే నాయకుడు. ఆయన పుట్టినరోజున ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేయడం నాకు గర్వంగా ఉంది” అని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికెట్లు, మెడికల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపే స్మారక చిహ్నాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ మణికుమార్, కుత్తూరు నరసింహ, హనుమంత్ రావు, లక్ష్మీ బస, రాణి కౌర్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.