06-10-2025 04:01:39 PM
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ది ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో చట్టబద్ధంగా ఆమోదించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. వాస్తవంగా అన్ని రకాల రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం అని, బీసీ రిజర్వేషన్లపై చట్టసవరణ బిల్లు, ఆర్డినెన్స్ ను అడ్డుకుంటున్నదే బీజేపీ నేతలు అని మంత్రి తెలిపారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిల్లులను ఆమోదింపచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఫ్యూడలిస్టు పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు హెచ్సీయూలో ఎస్సీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని మంత్రి పొన్నం వెల్లడించారు.
శాసనసభలో మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ న్యాయ ప్రక్రియలోనూ సహకరించాలని కోరారు. ప్రామాణికమైన లెక్కల ద్వారానే ఈ ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందని పొన్నం ప్రభాకర్ వివరించారు. సామాజిక స్పృహ కలిగిన వారంతా ప్రభుత్వంతో కలిసి రావాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల ఎవరి హక్కులకు భంగం కలగదని చెప్పారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగబోయ్యే ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.