06-10-2025 06:08:55 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నవంబర్ 11న నిర్వహించబడతాయని, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుందని భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం తెలిపారు. నవంబర్ 11వ తేదిన ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు ఉండగా.. ఇందులో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.
సెప్టెంబర్ 2న విడుదల చేసిన తొలి జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,92,669. నవీకరణ తర్వాత 6,976 మంది ఓటర్లు జోడించి, 663 మందిని తొలగించారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 ఉన్నట్లు కమీషన్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
ఇంతలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సన్నాహాలను పర్యవేక్షించడానికి కాంగ్రెస్ ముగ్గురు సభ్యుల మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. వి.నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, అనే నలుగురు సంభావ్య అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, దానిని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి అభిప్రాయాలను సేకరించడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ నాయకులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది.