calender_icon.png 29 January, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకరాగమనం

24-01-2025 12:00:00 AM

కాలం ఒక అనంత ప్రవాహం. మలుపులు, లోతులు, మెరకలు, దారంతా పరచుకున్న అద్భుతం. మలుపు తిరగాలి, లోతు ఎరగాలి, మెరక దాటాలి. నిజానికి కాలమే జీవితం! పంచరాత్ర, పాశుపత, శాక్త, జైన, బౌద్ధాలు అఖండ భారతాన్ని ఆవహించి, వైదిక జీవన ధర్మాలు వెనకబడుతున్నవేళ, ధర్మశూన్యత ఏర్పడిన వేళ, ధర్మోద్ధరణ అనివార్యం, అత్యవసరమైన వేళ, పరమేశ్వరుడు తనను తానే సృష్టించుకున్న మరొక మహా సన్మంగళ వేళ జరిగింది, శంకరాగమనం.

కాలం ఒక అనంత ప్రవాహం. మలుపులు, లోతులు, మెరకలు, దారంతా పరచుకున్న అద్భుతం. మలుపు తిరగాలి, లోతు ఎరగాలి, మెరక దాటాలి. నిజానికి కాలమే జీవితం! పంచరాత్ర, పాశుపత, శాక్త, జైన, బౌద్ధాలు అఖండ భారతాన్ని ఆవహించి, వైదిక జీవన ధర్మాలు వెనకబడుతున్నవేళ, ధర్మశూన్యత ఏర్పడిన వేళ, ధర్మోద్ధరణ అనివార్యం, అత్యవసరమైన వేళ, పరమేశ్వరుడు తనను తానే సృష్టించుకున్న మరొక మహా సన్మంగళ వేళ జరిగింది, శంకరాగమనం.

మానవ జీవితం నడపటానికి, గడపటానికి వచ్చింది కాదని, పరిపూర్ణంగా జీవించటానికని బోధించటానికి వచ్చిన ఆచార్యరూపం శంకరులు. సనాతన ధర్మాన్ని సనూతన జీవనధర్మంగా తీర్చిదిద్ది, అధునాతన సమాజానికి సాంఘిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గాన్ని విస్పష్టంగా నిర్దేశించిన వేదమూర్తి శంకరులు. చిరుప్రాయంలోనే సమస్త విద్యలను కైవసం చేసుకుని, కౌమార యవ్వన దశలలోనే మహాపండితులను వాదాలలో ఓడించి, అంటే సమాధాన పరచి, అద్వైత జీవన విధానాన్ని జాతికి వరదానం చేసిన అద్వైతమూర్తి ఆయన.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్‌ 

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్‌॥

‘చతుర్భి సహ శిష్యైస్తు శంకరోవార్త రిస్యతి’ అంటే పరమేశ్వరుడు గురువుగా, నలుగురు శిష్యులతో వస్తాడని అంటున్నది వాయు పురాణం. అంతే కాదు\

వ్యాకుర్వాన్ వ్యాస సూత్రార్థమ్ శృతేరర్థమ్ యతోచివాన్‌

శృతేర్నాయ్యః స ఏవర్తతః శంకర సవితాననీ॥

అంటే, శంకర భగవత్పాదులు మానవమాత్రులు కారు. ఆయన సూర్యదేవుడే. కాదు కాదు, ఆచార్య శంకరులు జ్ఞానాదిత్యులు. తత్త్వమసి!

శంకరుల అవనీ సంచారం, పరిమిత కాలంలో సాగిన మహిమా, మహనీయ రసార్ద్ర ఘట్టం. “అమ్మా! నీ చివరి క్షణాలలో నన్ను తలచుకో, మరు క్షణం నీ చెంత నిలుస్తాను. నీ అంత్యక్రియలు నేను జరుపుతాను” అని తన తల్లితో అన్నపుడు, ఆయన కర్మకాండను ధర్మబద్ధం చేశారు.

“అమ్మా! ఇకపై ఎవరు నాకు భిక్ష ఇస్తే ఆమే నా తల్లి. ఎవరు జ్ఞానబోధ చేస్తే ఆయనే నా తండ్రి. పరమశాంతమే నా సఖి. శిష్యులే నా సంతతి. ఏకాంతమే ఆనందం. మౌనమే నా భాష. మాటలే నా మౌనం! చూపులే బోధ!” అన్నపుడాయన మనస్సన్యాసి. విశ్వంభరుడు.

“నేను నేలను కాను. నింగిని కాను. నీరును కాను. నిప్పు ను కాను. అన్నీ కలిపి నేను కాను. కానీ, నేను చైతన్యాన్ని. ఏకాత్మను. యోగాన్ని. యోగాతీతుణ్ణి. అవస్థాత్రయాతీతుణ్ణి. ఏ వస్తువుతోనూ నాకు తాదాత్మ్యం లేదు. నేను శివుణ్ణి. చిదానందుణ్ణి, సదానందుణ్ణి, సర్వవర్ణాతీతుణ్ణి, నిరాకార నిస్తుల తేజాన్ని” అని గోవిందపాదుడితో అన్నపుడు శంకరుడు సర్వాత్మకుడు.

“సర్వేశ్వరా! సర్వేశ్వరా! మూడు తప్పులు చేశాను, మన్నించు. నీవు సర్వాంతర్యామివని తెలిసీ, అనేక దేవాలయాలు దర్శించాను. నీవు మనసుకు అతీతుడవని ఎరిగీ, మనసులో ధ్యానించాను. నీవు మాటలకు అందని వాడివని తెలిసి కూడా నిన్ను నుతిస్తూ, స్తుతిస్తూ అసంఖ్యాక స్తోత్రాలు వ్రాశాను.

నిజానికి నీవూ నేనూ ఒకటే అయినా ఈ పొరపాట్లు చేసినందుకు మన్నించు” అన్నపుడు ఆయన అద్వైతమూర్తి. ‘కనక ధారాస్తవం’ నాడు కారుణ్యమూర్తి. ‘సౌందర్యలహరి’ నాడు సదానందమూర్తి.‘శివానందలహరి’ నాడు సదాశివమూర్తి. ‘వివేక చూడామణి’ నాడు వైరాగ్యమూర్తి. ‘భజగోవిందమ్’ నాడు జగజ్జీవేశ్వర మూర్తి. జగత్తుపట్ల, సంసారం పట్ల, జీవుడిపట్ల శంకరుల సహజ కరుణాస్పర్శ, భజగోవిందమ్.

(తరువాయి వచ్చేవారం)