19-04-2025 11:52:32 PM
బుల్లెట్ మిస్‌ఫైర్‌తో భారతీయ విద్యార్థి మృతి...
న్యూఢిల్లీ: కెనడాలో హిందూ ఆలయాలు, భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆ దేశంలో ఓ భారతీయుడిని కత్తితో పొడిచి చంపిన దుర్ఘటన మరిచిపోకముందే తాజాగా దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థిని ప్రాణాలు విడిచినా ఘటన ఒంటారియోలో చోటుచేసుకుందని టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. హమిల్టన్‌లోని కాలేజీలో చదువుతున్న భారతీయ విద్యార్థి హర్‌సిమ్రత్ రంధవా స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
కారులో వచ్చిన దుండగుడు.. బస్టాప్ వద్ద ఆగి ఉన్న మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులకు దిగాడు. అయితే, అందులోని ఓ బుల్లెట్ మిస్ ఫైర్ అయి హర్‌సిమ్రత్‌కు తగిలింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి హర్‌సిమత్రత్ రక్తపు మడుగుల్లో పడిఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. హర్‌సిమ్రత్ మృతిపై భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పుల ఘటనలో ఓ అమాయకురాలు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొంది.