20 April, 2026 | 1:41 AM

లోతైన భావాల సంద్రం పొట్టి పోయెమ్స్

20-04-2026 12:00 AM

ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఉపాధ్యాయుడిగా పాఠాలూ బోధిస్తూనే సాహిత్య రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు సుంకరి కృష్ణ ప్రసాద్. ఆయన ‘పొట్టి కవితలు’ అనే ప్రక్రియలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అలా రాసిన  కవితలన్నింటి సమాహారంతో ఆయన ఇటీవల ‘పొట్టి పోయెమ్స్’ అనే సంకలనం వెలువరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఈ సంకలనాన్ని అంకితమిచ్చారంటే..

ఆయనకు బడి పిల్లలపై ఎంతటి మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సున్నితమైన భావావేశం కవితల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తక్కువ పదాల్లో లోతైన భావాన్ని పలకడం ఈ కవి శైలి. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవిత్వం హృద్యంగా సాగింది. ఈ పుస్తకంలోని కవితలను పరిశీలిస్తే ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. “నాకు కనిపించిన నిలువెత్తు సత్యం..

మా ఇంటి చెట్టు” అంటూ ఆయన ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు. చెట్టు నిస్వార్థానికి నిలువుటద్దం. మన కళ్లముందే ఉండి మనకు నీడను, ఫలాలను ఇచ్చే చెట్టే పరమార్థమని కవి వ్యక్తీకరించారు. ఉపాధ్యాయుడిగా ఆయన ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో ఈ పంక్తులు చెబుతున్నాయి. చెట్టును ఒక సత్యంగా చూడటం వెనుక ఆయన దార్శనికత కనిపిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల బతుకులను ఆయన తన కలంతో స్పృశించారు.

“వాడిన పూలే.. ఇంటి దీపాలు.. పేదల చీకటి బతుకులు” అన్న వాక్యాలు పాఠకుడి గుండెను మెలిపెడతాయి. వాడిపోయిన పూలతో పేదల జీవితాలను పోల్చడం చాలా గొప్ప ప్రయోగం. ఈ పదబంధాల్లో ఉన్న సొగసు మనల్ని ఆలోచింపజేస్తుంది. పేదరికం ఇచ్చే వేదనను, వారి జీవితాల్లోని అంధకారాన్ని ఈ కవిత ద్వారా కళ్లకు కట్టారు. సమాజం పట్ల కవికి ఉన్న అపారమైన కరుణ ఇక్కడ ప్రతిబింబిస్తుంది.

ప్రేమ, విరహం వంటి సున్నితమైన అంశాలను కూడా కవి ఎంతో పొయెటిక్‌గా వర్ణించారు. “పురాతన కోట మీద.. ఒంటరి పావురం.. శతాబ్దాల విరహం” అనే మాటలు ఒక దృశ్య కావ్యాన్ని తలపిస్తాయి. పురాతన కోట, ఒంటరి పావురం అనే గుర్తులు విరహ వేదనను రెట్టింపు చేస్తున్నాయి. కాలం గడిచినా మారని గాఢమైన ప్రేమను ‘శతాబ్దాల విరహం’ అనే పదంతో అద్భుతంగా చెప్పారు.

ఈ కవిత వెనుక ఉన్న భావుకత పాఠకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఆధునిక జీవనశైలిలోని డొల్లతనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. “ఇల్లు సీసీ కెమెరా నీడలో ఉంది.. మనసు జాడే కనిపించట్లే” అంటూ నేటి యాంత్రికతపై విమర్శ సంధించారు. భద్రత కోసం సాంకేతికతను వాడుకుంటున్నాం కానీ.. మనిషి మనసును మాత్రం పట్టించుకోవడం లేదని కవి ఆవేదన చెందారు. మానవ సంబంధాలు మృగ్యమవుతున్న వేళ మనిషి మనసును వెతుక్కోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ మాటలు పాఠకుడి అంతరాత్మను తట్టి లేపుతాయి. 

సుంకరి కృష్ణ ప్రసాద్ కవితలు చిన్నవే కానీ, అవి కలిగించే ప్రకంపనలు చాలా పెద్దవి.  ప్రతి కవిత ఒక మెరుపులా మెరిసి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. ఆయన వాడిన సరళమైన పదాలు, హృద్యమైన శైలి ఈ పుస్తకానికి అసలైన అందం. నిరంతరం వృత్తిలో రాణిస్తూనే.. ప్రవృత్తిగా అక్షర సేద్యం చేస్తున్న కృష్ణ ప్రసాద్ కృషి అభినందనీయం. ఆయన గతంలో ‘నా జీవన గీతం’, ‘నా లోపలి తీరాలు’ అనే రెండు పుస్తకాలు కూడా రచించారు.  ఈ పొట్టి కవితలు తెలుగు సాహిత్య లోకంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతాయి. ఆయన కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని కోరుకుందాం.