calender_icon.png 5 May, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌనోపదేశం

04-05-2025 12:00:00 AM

శ్రీ రామచంద్రుడు ధర్మయోగి, శ్రీకృష్ణుడు కర్మయోగి, శ్రీశంకర భగవత్పాదులు పూర్ణజ్ఞాన యోగి. జ్ఞానయోగంలో శంకరులు బోధించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ‘తత్త్వమసి’ స్థాయిలో వినబడే సమర్థ వ్యాఖ్యానం. ఫలితం ఆశించి చేసే కర్మలన్నీ ప్రవృత్తి. ఫలితంతో నిమిత్తం లేకుండా చేసే కర్మలన్నీ నివృత్తి. అంటే, ప్రపంచాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప సాధకుడు ఆత్మను అనుభవించలేడు.

ఈ విషయాన్నే శంకరులు తమ దర్శనంలో పరమోన్నత స్థాయిలో ఆవిష్కరించారు. ఆత్మధర్మాన్ని పరమసుందరంగా, అలవోకగా, సాధికారంగా వివరించారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ఒక శబ్దచిత్రం. మౌనం అంటే ఇంద్రియ మౌనం. వ్యాఖ్య, ముద్రా స్వరూపం.

కనిపిస్తున్న ఈ వస్తు ప్రపంచమంతా అద్దంలో బొమ్మ వంటిది. కలలో అనుభవించే దృశ్యం వంటిది. బింబం అంటూ ఒకటి ఏదో వున్నది కనుకే ప్రతిబింబం ఏర్పడుతున్నది. వెలిగించే వెలుగేదో వున్నది కనుక ప్రపంచంగా కనబడుతున్నది. విత్తనంలో దాగిన్న మహావృక్షం వలె, ఆత్మలోనే అన్నీ వున్నయ్. నిజానికి అన్నిటికీ మూలం అదే. కాకపోతే విత్తనంగానూ, చెట్టుగానూ రెండుగా కనిపిస్తున్న య్.

విత్తనంలో శక్తే లేకపోతే మొక్క కాలేదు కదా! మనసుతో ప్రపంచాన్ని చూస్తే బంధన. అదే మనసు ఆత్మను చూ డగలిగితే జీవన్ముక్తి. జ్ఞానాగ్నిలో కర్మలు దగ్ధం కావాలి. అదీ సాధన! చిల్లుల కుండలోని దీపం బయటకు వెలుగును ప్రస రించి వస్తువులను వెలిగించినట్లుగా, శరీ రం లోపలవున్న ఇంద్రియాలు ప్రపంచంలోని వస్తువులను ప్రకాశింప చేస్తున్నయ్. కనపడుతున్న శరీరాన్ని ఆత్మ ప్రకాశమంటాడు దేహాత్మవాది.

‘శరీరమే ఆత్మ’ అంటున్నాడు చార్వాకుడు. ‘ప్రాణమే ఆత్మ’ అంటున్నాడు ప్రాణాత్మవాది. ‘కలలోనూ, నిద్రలోనూ, మెలకువలోనూ తమ పనులు కొనసాగిస్తున్న ఇంద్రియాలే ఆత్మ’ అంటున్నారు ఇంద్రియాత్మ వాదులు. ‘బుద్ధి సహకరించకపోతే ఇంద్రియాలు ఏం చేస్తయ్’ అంటున్నారు.

బుద్ధ్యాత్మవాదులు. ‘అజ్ఞానం కారణంగానే ఆత్మ అనుభవంలోకి రావ టం లేదు’ అంటున్నారు శూన్యవాదులు. నిజానికి వీరంతా స్పృహలేని వారే. ఇవన్నీ వారి వారి వాదనలే. ‘వేది’కి అంటే ఎరుక వున్నవాడికి ఆత్మే అంతా! అదే అన్నీ! వేరే మరొకటి లేదు.

నిద్ర, మెలకువ, హాయి, స్పురణ, గుర్తెరగటం... ఇవన్నీ ప్రదేశానికీ, కాలానికి అతీతం. ఎందుకంటే, అనుభవం వున్నది కనుకే జ్ఞాపకం ఏర్పడింది. అది చాలాకాలం తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకుంటున్నప్పుడు కలిగే తీయని అనుభూతి వంటిది. మన శరీరంలో ఏర్పడే అవస్థలన్నీ ‘మనం, మన నీడ’ వంటివి. మనమంటూ లేకపోతే మన నీడలు ఎట్లా ఏర్పడతయ్? మన ఉనికికి మూలమైన ఆత్మ అన్ని వేళలా, అన్ని కాలాల విశ్వకళ్యాణ కాంక్షియే!

ఆత్మ నిత్య ముక్తం. దానికి బంధన లేదు. అది సర్వ వ్యాపకం. శరీరం పరిణామ శీలం. పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, ఒరుగుతుంది. కంటికి కనిపిస్తున్నది కనుక నిజమే అనిపిస్తుంది. వేదాంతులు ‘ఇదంతా మాయవల్ల’ అంటున్నారు. ఇంతకీ మాయ, ఈశ్వర శక్తి కంటే వేరు కాదు.

మాయనుంచి బయట పడాలంటే ధ్యానంలో వుండాలి. ధ్యానమంటే నీలో నీవు నిశ్చలంగా వుండటమే. యోగమంటే నీతో నీవు కూడి వుండటమే. మార్పు చెందే దేహం శవం! మార్పు ఎరుగని ఆత్మ శివం!! ఈ విచారణంతా ‘అంతర్ముఖం’ వైపు నడిపిస్తుంది.

ఇదే స్థూలంగా భగవత్పాదుల దివ్యబోధ, నిత్యప్రార్థన. శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వంటి విషయాలను హేతుబద్ధంగా, స్పష్టంగా, అర్థం చేసుకోగలిగితే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ‘మన లోపలకు మన దృష్టి సారించగల ఉపాయాన్ని’ సూచిస్తుంది. చేయవలసింది ప్రయత్నమే! పొందబోయేదంతా వినిర్మల ప్రశాంతతే!