13-01-2026 12:00:00 AM
సినిమా ఒకప్పుడు సామాన్యుడికి ఊరట. కష్టమైన జీవితానికి మూ డు గంటల విరామం. ఆలోచనల భారాన్ని కాసేపు మరిపించే రంగుల లోకం. కానీ అదే సినిమా సామాన్యుడి జీవితంలో భారంగా మారింది. నేడు సినిమా కేవలం తెరపై కనిపించే కథ కాదు కోట్ల రూపాయల పెట్టుబ డులతో నడిచే ఒక భారీ వ్యాపార యంత్రం. ఈ యంత్రాన్ని నడిపించే ఇంధనం ఎవరు? నిర్మాతలా, దర్శకులా, హీరోలా? వీరెవరు కాదు. ఈ భారాన్ని మోసేది ప్రేక్షకులు మా త్రమే. వీరిలో చాలామంది రోజువారీ కూలీ, చిన్న ఉద్యోగి, మధ్యతరగతి కుటుంబాల వా రే ఎక్కువగా ఉన్నారు. అభిమానం అనే పెట్టుబడి పెడుతున్న సామాన్య ప్రేక్షకుడు క్రమంగా దోపిడీకి గురవుతున్నాడు. జేబులోని చివరి నోటు వరకూ లాగేసుకునే ఈ వ్యవస్థలో అభిమానం కరెన్సీగా మారింది. సామాన్యుడి అభిమానాన్ని ప్రేమగా కాదు, లెక్కలతో కొలిచే స్థితికి సినిమా పరిశ్రమ వచ్చిందన్నది నిజం.
వేదికలపై అభిమానులే దేవుళ్లు అని చెప్పే మాటలు, విడుదల రోజు టికెట్ ధరల దగ్గరికి వచ్చేసరికి మాయమవుతున్నాయి. అభిమానం అనే బలహీనతతో సినిమా కోసం ఎంతైనా చెల్లిస్తున్నారు. తెలు గు రాష్ట్రాల నెలసరి ఆదాయం 20వేల రూపాయలలోపే గనుక నలుగురు కుటుంబ సభ్యులు మొదటి వారంలో సినిమా చూస్తే టికెట్స్, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ మొత్తం కలిపి మూడు వేలు అనగా ఆదాయంలో పదిహేను శాతం కేవలం మూడు గంటల వినోదానికి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది రైతు కుటుంబానికి ముప్పు రోజుల కూరగాయలు, కూలీ కుటుంబానికి పిల్లల స్కూల్ ఫీజు, మధ్యతరగతికి విద్యుత్ బిల్లు అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నెల రోజుల అవసరాల కోసం చేసే పొదుపు, ఒక సినిమా తొలి రోజు టికెట్ కొనడానికి ఖర్చవుతుంటే ఇది వినోదమా? దోపిడీనా అనేది ఆలోచించాలి. గత దశబ్దకాలంగా చూసినట్లయితే సినీరంగం సామాజిక బాధ్యతను కోల్పోయిన అనుమానాలు బలపడుతున్నాయి.
ఆత్మపరిశీలన అవసరం!
ప్రేక్షకుల జేబుల నుంచి వచ్చే ప్రతి రూపాయి మీదే ఈ రంగుల ప్రపంచం నిలబడుతుంది. అయినా ఏ రోజైన వారి కోసం సినిమా నటులు ఏమైనా చేశారా? అంటే సమాధానం ఉండదు. హీరో, దర్శకులు అడిగిన కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లు ఇచ్చిన నిర్మాత ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకొని టికెట్ ధరలు పెంచి బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోల పేరుతో ప్రేక్షకుడి జేబులను చిల్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా రు. అభిమానం అంటే ప్రేమ కానీ ఆ ప్రేమ కు వివేకం అవసరం. మా హీరో కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తాం అనే నినాదం చివరికి మన కుటుంబాల బడ్జెట్‌ను చీల్చుతుం ది. పిల్లల ఫీజులు, ఇంటి అవసరాలు పక్కనపెట్టి ఒక సినిమా కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం గర్వకారణమా? లేక ఆత్మవంచనా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు నటుడు పాత్ర కో సం పారితోషికం తీసుకునేవాడు.
ఇప్పుడు పాత్రలన్నీ కేవలం పారితోషికం కోసమే రా స్తున్నారేమోననిపిస్తున్నది. నటుడి అభిమానుల్లో ఎక్కువగా కూలీలు, మధ్యతరగతి ఉ ద్యోగులే ఉంటారు. వారి వల్లే వందల కోట్ల రెమ్యూనరేషన్ వస్తుంటే, ఆ భారం చివరకు వారి మీదే పడుతుందన్న నిజాన్ని నటులు గుర్తించాల్సిన అవసరం లేదా? రెమ్యూనరేషన్ తగ్గితే స్టార్‌డమ్ తగ్గుతుందా? అభిమా నులకు భారం కాకుండా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే భాద్యత హీరోలకు లేదా? హీరోకు పారితోషికం పెరిగితే సమాజానికి లాభమేమిటి? దీనివల్ల విద్యావ్యవస్థ మెరుగుపడిందా? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన చదువు అందుతోందా? ఉపాధి పెరిగిందా? రైతు ఆత్మహత్యలు ఆగాయా? పంటకు గిట్టుబాటు ధర దొరుకుతుందా? ఆసుపత్రుల్లో పేదవాడికి ప్రత్యేక చికిత్స దొరుకుతుందా? ఇలాంటివేమి జరగడం లేదు. ‘మా హీరో కోసం’ అనే నినాదం సినీ అభిమానులను బందీ చేస్తుంది.
అభిమానం కాదు బానిసత్వం..
సినిమా బాగోలేకపోయినా చూస్తాం.. ధరలు పెరిగినా ప్రశ్నించమనేది అభిమానం కాదు స్వచ్ఛంద బానిసత్వమే. బస్‌ఛార్జ్ ఒక్క రూపాయి పెరిగితేనే రోడ్డెక్కే రాజకీయ పార్టీ లు, సినిమా టికెట్ ధరలు ఐదు రెట్లు పెరిగితే మాత్రం ఎందుకు మాట్లాడవు? విద్యు త్ ఛార్జ్ పెరిగితే ధర్నాలు చేస్తారు.. అదే టికెట్ పేరుతో ప్రేక్షకుడి దోపిడీపై మౌనం వహిస్తారు. స్టార్ ఇమేజ్ తో రాజకీయ లాభ మా? ఇక్కడ ఓటు బ్యాంక్ కనిపించదా సిని మా విడుదలైన మొదటి మూడు రోజులు ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇచ్చి టికెట్ ధరలు పెంచడం ఒక విచారకరమైన సంప్రదాయంగా మారింది.
‘బెనిఫిట్ షో’ అనే పేరుతో వేల రూపాయలు వసూ లు చేయడం వినోద రంగానికి మచ్చ తెస్తోం ది. ఎందుకంటే దేశంలో పెట్రోల్ ధర పెరిగినా ఆలోచిస్తాం, బియ్యం ధర పెరిగినా చర్చిస్తాం, కూరగాయ ధర రూపాయి పెరిగితే బేరమాడే మనం సినిమా టికెట్ ధర వంద నుంచి వెయ్యికి పైగా పెరిగినా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ మౌనంగా చెల్లిస్తూ సం బరం చేసుకుంటాం. ఇది అభిమానం కాదు. మన ఆలోచనకు వేసిన పాతర.
బాధ్యత ప్రభుత్వాలదే!
కథ లేకున్నా, భావం లేకున్నా హైపు కోసం సినిమాకు విపరీతంగా ఖర్చు చేసి ఆ భారం మాత్రం సగటు ప్రేక్షకుడి మీద వేస్తున్నారు. ఇది కళా రంగమా? లేక ప్రజల జేబులపై పడ్డ దాడా అనేది అర్థం కాదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాల పాత్రను కూడా విస్మరించలేం. ప్రజలను రక్షించాల్సిన ప్రభు త్వాలు సినిమా విషయం లో మాత్రం వాళ్లే అనుమతులిస్తున్నారు. బియ్యం ధర పెరిగితే జోక్యం, పెట్రోల్ ధర పెరిగితే చర్చ, కానీ సినిమా టికెట్ ధరలు పెరిగితే మౌనం ఎందుకు?. ప్రజల జేబు ప్ర జాస్వామ్యంలో లెక్కలోకి రాదా అనే ప్రశ్నకు.. ఈ దోపిడీకి ప్రేక్షకుడే ఆహ్వానం పంపిస్తున్నాడన్న నిజాన్ని అంగీకరించాల్సి ఉంటుంది.
మార్పు కావాలంటే ఈ వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బా ధ్యతను గు ర్తించాలి. అభిమానులు హీరోను నటుడిగా మాత్రమే చూడాలి. నటులు రెమ్యూనరేషన్‌తో పాటు సామాజిక బాధ్యతను గుర్తెరగాలి. నిర్మాతలు లాభం కంటే సమతుల్యతకు ప్రాధా న్యమివ్వాలి. ప్రభుత్వాలు టికెట్ ధరలకు గరిష్ట పరిమితి విధించి నియంత్రణ తీసుకురావాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకుడు అభిమానం మీద ఆలోచన అనే అంకుశం వేయాలి. సినిమా ఒక కళ. ఆ కళ ప్రజలను రంజింపజేయాలి, రోడ్డెక్కించకూడదు. జేబులు ఖాళీ చేయడం కాదు హృద యాలను తాకేలా సినిమాలు తీయాలి.
దుప్పటి మొగిలి